యువకుడితో యువకుడి పెళ్లి

ABN , First Publish Date - 2022-04-06T05:18:00+05:30 IST

ఎక్కడైనా యువతీ, యువకుడు పెళ్లి చేసుకోవడం సాధారణం. కానీ సమాజమే నివ్వెరపోయేలా ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని చండూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది.

యువకుడితో యువకుడి పెళ్లి

చిల్‌పచెడ్‌ మండలం చండూర్‌లో ఘటన

చిల్‌పచెడ్‌, ఏప్రిల్‌ 5 : ఎక్కడైనా యువతీ, యువకుడు పెళ్లి చేసుకోవడం సాధారణం. కానీ సమాజమే నివ్వెరపోయేలా ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని చండూర్‌ గ్రామంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడు, మండలంలోని చండూర్‌ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఒక కల్లు దుకాణంలో రెండునెలల క్రితం పరిచయమయ్యారు. వారి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. కాగా ఈ నెల 1న తాగిన మైకంలో జోగిపేటకు చెందిన యువకుడు చండూర్‌ గ్రామానికి చెందిన యువకుడితో జోగిపేట జోగినాథ్‌ ఆలయంలో రాత్రిపూట తాళి కట్టించుకున్నాడు. వారంరోజులు గడిచిన తర్వాత తనను కాపురానికి తీసుకుపోవడం లేదంటూ చండూర్‌ గ్రామానికి వచ్చి యువకుడి తల్లిదండ్రులతో వాదనకు దిగాడు. ఇలా చేయడం సరికాదని ఎంతచెప్పినా వినిపించుకోలేదు. చివరికి తల్లిదండ్రులు సముదాయించి జోగిపేటకు చెందిన యువకుడిని పంపించి వేశారు. కానీ ఆ యువకుడు నేరుగా చిల్‌పచెడ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు చట్టంలో ఇలాంటివి లేవని, కేసు ఎలా నమోదు చేసుకోవాలో తెలియక అయోమయానికి గురికావాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పెద్దలు స్టేషన్‌కు వచ్చి ఇద్దరితో మాట్లాడి జోగిపేటకు చెందిన యువకుడికి రూ.10 వేలు ముట్టజెప్పి మళ్లీ ఎలాంటి గొడవకు దిగవద్దని, ఏదైనా తిరకాసు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జోగిపేటకు చెందిన యువకుడు స్టేషన్‌ నుంచి ఫిర్యాదును వాపసు తీసుకున్నాడని ఎస్‌ఐ గౌస్‌ తెలిపారు. ఈ విషయం నలుగురికి తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. 

Read more