వీడని ముసురు

ABN , First Publish Date - 2022-09-12T05:03:39+05:30 IST

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ముసురు కమ్మేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని కోమటిచెరువు మత్తడి దూకింది.లింగారెడ్డిపల్లి, చిన్నకోడూరు రోడ్డులో వాననీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.

వీడని ముసురు
చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్‌, దర్గాపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు

జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం

పొంగిపొర్లుతున్న చెరువులు, చెక్‌డ్యాంలు

రాకపోకలకు అంతరాయం.. 

 వాహనదారులకు తప్పని ఇక్కట్లు

పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు, ఇళ్లు

అత్యవసరం అయితే తప్ప  ప్రయాణాలు చేయొద్దని పోలీసుల హెచ్చరిక


 సిద్దిపేటటౌన్‌/వర్గల్‌/చేర్యాల/మద్దూరు/చిన్నకోడూరు/కోహెడ/నారాయణరావుపేట, సెప్టెంబరు 11: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ముసురు కమ్మేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని కోమటిచెరువు మత్తడి దూకింది.లింగారెడ్డిపల్లి, చిన్నకోడూరు రోడ్డులో వాననీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.


జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు 

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా నారాయణరావుపేటలో 96.3 మిల్లిమీటర్లు, బెజ్జంకిలో 91.2 మిల్లిమీటర్లు, దుబ్బాకలో 85.4, సిద్దిపేట రూరల్‌లో 75.0, కోహెడలో 70.3, మిరుదొడ్డిలో 65.9, నంగునూర్‌లో 63.5, సిద్దిపేటలో 53.5, చిన్నకోడూర్‌లో 52.2, హుస్నాబాద్‌లో 49.3, వర్గల్‌లో 49.3, దౌల్తాబాద్‌లో 44.9, మద్దూర్‌లో 43.0, గజ్వేల్‌లో 42.1, ధూల్మిట్టలో 42.0, జగదేవ్‌పూర్‌లో 41.9, కొమురవెల్లిలో 41.3, కొండపాక, రాయిపోల్‌లో 41.2, ములుగులో 40.9, మర్కూక్‌ లో 40.3, తొగుటలో 38.5, చేర్యాలలో 35.6, అక్కన్నపేట మండలంలో 35.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్గల్‌లో మండలంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వర్గల్‌ గౌరారం రహదారిపై వర్షం నీరు పారడంతో వాహనాదారులకు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. 


కూలిన ఇంటిపై కప్పు.. 

 రెండు రోజులుగా చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. చేర్యాల-సిద్దిపేట ప్రధాన రహదారిపై ఇప్పటికే ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా మారాయి. చేర్యాల-నాగపురి దారిలో కడవేరుగు శివారులో లో-లెవల్‌ కల్వర్టు వద్ద వరదనీటి ప్రవాహం రోడ్డుపై నుంచి వెళ్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముస్త్యాలలోని చెరువు మత్తడి పారుతున్నది. తాడూరు గ్రామశివారులోని వాగునీరు లో-లెవల్‌ బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపోయాయి. కొమురవెల్లి మండలకేంద్రంలో మాంకాల వెంకటయ్య ఇల్లుపైకప్పు నేలకూలింది. తృటిలో ప్రాణపాయం తప్పింది. సామాగ్రి పూర్తిగా ధ్వంసమైంది. మద్దూరులో కల్వర్టు వద్ద వాగు ప్రవహిస్తున్నది. గాగిళ్లాపూర్‌లో పెద్ద చెరువు మత్తడి పోస్తుండటంతో స్థానిక పోలీసులు ముందస్తుగా కల్వర్టు గుండా వాహన రాకపోకలను నిలిపివేశారు. మద్దూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద చెట్టు విరిగిపడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు సిబ్బందితో చెట్ల కొమ్మలను తొలగించారు. చిన్నకోడూరు మండలంలోని సికింద్లాపూర్‌ నుంచి నంగునూరు మండలంలోని దర్గాపల్లికి వెళ్లే రోడ్డులో సికింద్లాపూర్‌ శివారులో ఉన్న వాగు పై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాత్కాలికంగా రాకపోకలకు పక్క నుంచి మట్టి రోడ్డు వేశారు. వాగు ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహనికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కోట్టుకుపోయింది. రెండు గ్రామాల మధ్య రాక పోకలు నిలిచిపోయాయి.


మోయతుమ్మెదపై వరద ప్రవాహం

 భారీ వర్షాలకు కోహెడ మండలంలోని బస్వాపూర్‌ మోయతుమ్మెద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆదివారం లోలెవెల్‌ బ్రిడ్జి నుంచి వరద వెళ్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సిద్దిపేట- హనుమకొండ  ప్రధాన రహదారిపై  ఉన్న బ్రిడ్జి పై  నీరు ప్రవహిస్తున్నందున హుస్నాబాద్‌ సీఐ ఎర్రోళ్ల కిరణ్‌  ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి మోయ తుమ్మెద వాగును సందర్శించారు.  వాహనదారులు ఎవరూ ఈ రూట్‌లో ప్రయాణించవద్దని సీఐ కిరణ్‌ సూచించారు. పోలీ్‌ససిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నారాయణరావు పేట మండలంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలా మారి మత్తళ్లు దుంకుతున్నాయి. పలు గ్రామాల్లో సర్పంచులు చెరువులు, కుంటలు, వాగుల వద్ద ప్రజలను అప్రమత్తం చేశారు. నారాయణరావుపేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాల మధ్య కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


నాలుగురోజులుగా మంజీర పాయల్లోనే 

కొల్చారం: నారాయణపేట జిల్లాకు చెందిన ఆరుగురు గొర్రెలకాపరులు గొర్రెలతో సహా మెదక్‌ జిల్లాలోని మంజీరాపాయల్లో నాలుగురోజులుగా చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎగువన ఉన్న సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్‌ జిల్లా పరిధిలోని మంజీరా నది పరవళ్లు తొక్కుతుంది. ఘనపురం ఆనకట్ట(వనదుర్గా ప్రాజెక్టు)కు శుక్రవారమే పెద్దఎత్తున వరద నీరు వచ్చింది. కట్టపై నుంచి వరద పొంగిపొర్లుతున్నది. నారాయణపేట జిల్లాకు చెందిన ఆరుగురు గొర్రెలకాపరులు 1700 గొర్రెలను మేత మేపుకుంటూ కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్‌ శివారులో టేకుల బొద్దే వద్ద ఉన్న మంజీర పాయల్లోకి వెళ్లారు. గుట్టల మధ్య వారు గొర్రెలను మేపుకుంటూ ఉండగా శుక్రవారం అకస్మాత్తుగా ఘనపూర్‌ ఆనకట్టపై నుంచి వరద పొంగి దిగువకు ప్రవహిస్తుండడంతో కిష్టాపూర్‌ శివారులో టేకుల బొద్దే వద్ద మంజీర పాయల్లో  గొర్రెలతో సహా గొర్రెలకాపర్లు చిక్కుకున్నారు. నాలుగు రోజులుగా వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ తమను రక్షించే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఎస్పీ రోహిణిప్రియదర్శిని, రాష్ట్ర గొర్రెల, మేకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపుమలిశెట్టి ఆదివారం ఘటన స్థలం సమీపంలోకి వెళ్లి గొర్రెలకాపర్లతో ఫోన్‌లో మాట్లాడి వారికి ధ్యైరం చెప్పారు. తమ వద్ద వారానికి సరిపడే సామగ్రి వుందని కాపర్లు ఫోన్లో తెలిపారు.





Updated Date - 2022-09-12T05:03:39+05:30 IST