గురుకుల విద్యార్థికి తగిలిన షాట్‌పుట్‌ బాల్‌

ABN , First Publish Date - 2022-09-17T05:54:45+05:30 IST

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలో షాట్‌పుట్‌ బాల్‌ తగిలి విద్యార్థికి గాయాలవగా సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్‌ నిర్వహించిన సంఘటన శుక్రవారం జరిగింది. రోజువారీలాగే విద్యార్థులు ఉదయం వేళ పాఠశాల మైదానంలో ఆటలాడుకుంటున్నారు.

గురుకుల విద్యార్థికి తగిలిన షాట్‌పుట్‌ బాల్‌
ఆస్పత్రిలో శ్రావణ్‌కుమార్‌కడుపులో గాయం కావడంతో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలింపు

లివర్‌ భాగంలో దెబ్బతినడంతో ఆపరేషన్‌ నిర్వహణ


చేర్యాల, సెప్టెంబరు 16 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలలో షాట్‌పుట్‌ బాల్‌ తగిలి విద్యార్థికి గాయాలవగా సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్‌ నిర్వహించిన సంఘటన శుక్రవారం జరిగింది. రోజువారీలాగే విద్యార్థులు ఉదయం వేళ పాఠశాల మైదానంలో ఆటలాడుకుంటున్నారు. స్పోర్ట్‌ మీట్‌లో భాగంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ ఇంటర్‌ విద్యార్థి షాట్‌పుట్‌ బాల్‌ విసిరాడు. అదే సమయంలో గమనించుకోకుండా అటుగా వచ్చిన 9వ తరగతి విద్యార్థి బి.శ్రావణ్‌కుమార్‌కు షాట్‌పుట్‌ బాల్‌ కడుపులో తగిలింది. వెంటనే ప్రిన్సిపాల్‌ అశోక్‌, ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఛాతీ కింద, లివర్‌ భాగంలో దెబ్బతినడంతో ఆపరేషన్‌ చేశారు. 48గంటలు పరిశీలనలో ఉంచాలని వైద్యులు సూచించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని రోదించారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్‌ అశోక్‌ స్పందిస్తూ పీడీ, పీఈటీలు గ్రౌండ్‌లోనే ఉన్నారని, కానీ ప్రమాదవశాత్తు చోటుచేసుకున్నదని వివరించారు. 

పీడీ, పీఈటీల తీరుపై విమర్శలు

ప్రిన్సిపాల్‌ పీడీ, పీఈటీలు గ్రౌండ్‌లోనే ఉన్నారని చెబుతున్నా వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీడీ నర్సయ్య క్వార్టర్స్‌లో నుంచి బయటకు రాడని, పీఈటీ స్టోర్‌ పెట్టుకుని స్నాక్స్‌ విక్రయించుకుంటుండటంతో విద్యార్థులపై శ్రద్ధ కనబరడం లేదన్న ఆరోపణలున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను పర్యవేక్షించాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు.


Read more