సిద్దిపేటకు అవార్డుల పంట

ABN , First Publish Date - 2022-10-03T05:14:14+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 జాబితాలో సిద్దిపేట పట్టణాన్ని రికార్డు స్థాయిలో ఏడు అవార్డులు వరించాయి.

సిద్దిపేటకు అవార్డుల పంట
సిద్దిపేటలోని మున్సిపల్‌ కార్యాలయం

స్వచ్ఛసర్వేక్షణ్‌-2022లో ఏడు అవార్డులు

జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు

ప్రేరక్‌ డౌర్‌ సమ్మాన్‌లో గోల్డ్‌మెడల్‌

తెలంగాణలో ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు


సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 2:  కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 జాబితాలో సిద్దిపేట పట్టణాన్ని రికార్డు స్థాయిలో ఏడు అవార్డులు వరించాయి. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉన్న పట్టణంగా దేశంలోనే 3వ స్థానం, తెలంగాణలో ఉత్తమ మున్సిపాలిటీగా మొదటి స్థానం, దేశంలో గల 4,354 పట్టణాల్లో సిద్దిపేటకు 30వ ర్యాంకు, ఒక లక్ష నుంచి 3లక్షల జనాభా గల 382 పట్టణాల కేటగిరిలో 20వ ర్యాంకు, మున్సిపాలిటీ నిర్వహణలో ‘స్టార్‌’ రేటింగ్‌, ఓడీఎఫ్‌ కేటగిరిలో ప్లస్‌ప్లస్‌ గుర్తింపు, ప్రేరక్‌ డౌర్‌ సమ్మాన్‌ అంశంలో గోల్డ్‌ కేటగిరి దక్కింది.


రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022లో భాగంగా దేశవ్యాప్తంలో 4,354 పట్టణాలు పాల్గొన్నాయి. వీటిలో లక్ష జనాభా దాటిన పట్టణాల్లో సిటిజెన్స్‌ పార్టిసిపేషన్స్‌ కేటగిరిలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ల్రంలో ఉత్తమ మున్సిపాలీటీగా సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. త్వరలోనే ఆ అవార్డులను సిద్దిపేట మున్సిపల్‌ అందుకోనున్నది. ఇక ఏడు అంశాల్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేకు 7,500 మార్కులు కేటాయించగా అందులో సిద్దిపేట మున్సిపాలిటీ 5,540 మార్కులు సాధించింది. స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ సర్వేలో సర్వీస్‌ లెవల్‌ ప్రొగ్రె్‌సకు 3000 మార్కులకు గాను 2559 మార్కులు, ఒడిఎఫ్‌++, జీఎ్‌ఫసీ (గార్బేజ్‌ ఫ్రీ సిటీ) సర్టిఫికేషన్‌లో 2250 మార్కులకు 1000 మార్కులు, సిటిజెన్‌ వాయి్‌సలో 2250 మార్కులకు 1981 మార్కులు సాధించింది. గార్బేజ్‌ ఫ్రీ సిటీ (చెత్త రహిత పట్టణం)గా సిద్దిపేట మున్సిపాలిటీ మొట్టమొదటి సారిగా స్టార్‌ రేటింగ్‌లో నిలిచింది. 


తడి, పొడి, హానికర చెత్త సేకరణలో గోల్డ్‌ మెడల్‌

సిద్దిపేటలో ప్రతిరోజు మున్సిపల్‌ సిబ్బంది సేకరిస్తున్న తడి, పొడి, హానికర చెత్తసేకరణలో కేంద్ర ప్రకటించిన అవార్డుల్లో మొట్టమొదటి సారిగా సిద్దిపేట మున్సిపాలిటీకి గోల్డ్‌మెడల్‌ వరించింది. కొన్నేళ్లుగా సిద్దిపేట మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పలు విభాగాల్లో 19కి పైగా అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సారి సిద్దిపేట సిగలో మరికొన్ని వచ్చి చేరాయి. 


ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం

- హరీశ్‌రావు, మంత్రి

దేశస్థాయిలో సిద్దిపేటకు మరోసారి అవార్డులు రావడం సంతోషంగా ఉంది. సిద్దిపేట ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. అధికారుల ఐక్యత, ప్రజలు చూపిన చైతన్యం వల్లే ఈ ఘనత. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్‌రహిత సిద్దిపేటగా, దేశంలో తొలి మున్సిపాలిటీగా అవార్డు సాధించి ఆదర్శంగా నిలవాలి


మంత్రి హరీశ్‌రావు స్ఫూర్తి.. ప్రజల భాగస్వామ్యం

- కడవెర్గు మంజుల, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

సిద్దిపేట దేశస్థాయిలో ఏడుఅంశాల్లో ర్యాంకులు సాధించి, అవార్డులు పొందింది అంటే మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమైంది. పట్టణ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తున్న మంత్రికి, కౌన్సిల్‌ సభ్యులకు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు.


సిద్దిపేట ముందుడేలా 

- సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సిద్దిపేట

జాతీయస్థాయిలో ర్యాంకులు, అవార్డులు రావడం ఆనందంగా ఉంది. అందుకు గానూ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయం. దేశంలో సిద్దిపేట ముందుడేలా మరింత కష్టపడి పనిచేస్తాం. 

Read more