19 డిజైన్లు..190 వెరైటీలు

ABN , First Publish Date - 2022-09-20T04:41:28+05:30 IST

తెలంగాణ మహిళలు ఆరాధ్య పండగగా భావించే బతుకమ్మ సంబురాలు సమీపించాయి.

19 డిజైన్లు..190 వెరైటీలు
సర్కారు పంపిణీ చేయనున్న బతుకమ్మ చీరలు

జిల్లాకు చేరిన 1.92 లక్షల బతుకమ్మ చీరలు

మొత్తం 3.84 లక్షల మంది మహిళలు

ప్రతీ యేటా ఆడపడుచులకు సర్కారు కానుక

ఈ సారి చీర, బ్లౌజు పీస్‌ వేర్వేరుగా..

ఈనెల 25లోగా పంపిణీ చేసేలా చర్యలు


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 19: తెలంగాణ మహిళలు ఆరాధ్య పండగగా భావించే   బతుకమ్మ సంబురాలు సమీపించాయి. ఈనెల 25 నుంచి  ప్రారంభమయ్యే వేడుకలకు హడావుడి  మొదలైంది. ఈ క్రమంలో ప్రతి యేటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను జిల్లాకు సరఫరా  చేశారు. అయితే ఇప్పటి వరకు సగం స్టాకు మాత్రమే వచ్చింది. గతంలో  చీరలోనే బ్లౌజు ముక్క ఉండేది. ఈసారి  బ్లౌజు, పీస్‌ను వేరుగా ఇవ్వనున్నారు. 

సిద్దిపేట జిల్లాలోని 24 మండలాల్లో గల తెల్లరేషన్‌ కార్డుల ఆధారంగా యువతులు, మహిళలు, వృద్దుల వివరాలను గుర్తించారు. 18 ఏళ్లు నిండిన వారికే బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్న క్రమంలో ఆ దిశగా దృష్టి సారించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,84,234 మంది మహిళలు ఉన్నట్లు నివేదిక రూపొందించారు. జిల్లాలో గల రేషన్‌షాపుల వారీగా ఈ జాబితాను తయారు చేశారు. ఆయా రేషన్‌ దుకాణాల పరిధిలో ఉన్న మహిళలకు ఈనెల 25లోగా చీరలు పంపిణీ  చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 


చీర, బ్లౌజు వేర్వేరుగా

బతుకమ్మ చీరల పంపిణీలో ప్రతియేటా కొత్తదనాన్ని ఆచరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి చీరలను పంపిణీ చేసినపుడు పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సాదాసీదా చీరలను పంపిణీ చేశారని, అన్నీ ఒకేరకంగా ఉన్నాయని ఆరోపించారు. పలుచోట్ల బహిరంగంగానే చీరలకు నిప్పు పెట్టి నిరసనలు తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకట్రెండుకే పరిమితమైన డిజైన్లను పదుల సంఖ్యలోకి మార్చారు. వందల సంఖ్యలో వెరైటీలు ఉండేలా జాగ్రత్త వహించారు. చీరల నాణ్యతలో కూడా రాజీపడకుండా ప్రయత్నించారు. మహిళల నుండి మళ్లీ విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఈసారి చీరను, బ్లౌజు ముక్కను వేర్వేరుగా అందించనున్నారు. గతంలో చీర అంచున ఉన్న బ్లౌజు పీస్‌ను కట్‌ చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు వేర్వేరుగా ఇవ్వాలని నిర్ణయించారు. 19 డిజైన్లలో 190 వెరైటీలలో ఈ చీరలను ప్రత్యేకంగా సిరిసిల్ల మగ్గాలపై తయారు చేయించారు. 


ఇంకా సగం చీరలు రాలేదు

జిల్లా వ్యాప్తంగా 3.84లక్షల మంది మహిళలు ఉన్నట్లు గుర్తించగా ఇప్పటి వరకు 1.92లక్షల చీరలు మాత్రమే వచ్చాయి. ఇంకా సగం చీరలు రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాకు దిగుమతైన చీరలను హుస్నాబాద్‌లోని మార్కెట్‌ గోదాములో నిల్వ చేశారు. ఇక్కడి నుంచి దాదాపు 12 మండలాలకు చీరలను పంపిణీ చేయనుండగా.. మళ్లీ వచ్చే 1.92లక్షల చీరలను సిద్దిపేట లేదా గజ్వేల్‌ గోదాముల్లో నిల్వ చేసి అక్కడి నుండి మిగతా 12 మండలాలకు చేరవేయనున్నట్లు తెలిసింది. అయితే బతుకమ్మ అమావాస్యకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ లోగా మిగితా సగం చీరలను దిగుమతి చేసుకోవడం, వాటిని ప్రతీ మహిళకు చేరవేయాలంటే అధికార యంత్రాంగం మరింత శ్రమించాల్సిందే.  



Updated Date - 2022-09-20T04:41:28+05:30 IST