18 ఏళ్లు నిండితే ఓటరుగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-12-02T00:12:32+05:30 IST

జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్‌ శరత్‌ సంబంధిత అధికారులకు సూచించారు

18 ఏళ్లు నిండితే ఓటరుగా నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

ఈనెల 8 వరకు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం

అధికారులతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డిటౌన్‌, డిసెంబరు1: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్‌ శరత్‌ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వో సూపర్‌వైజర్లతో ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై సమీక్షించారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందిరినీ ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. 17 ఏళ్లు నిండిన వారు కూడా ముందస్తుగా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని చెప్పారు. ఏమైనా మార్పు లు, చేర్పులు ఉంటే డిసెంబర్‌ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో సరిచేసుకోవాలని, డిసెంబరు 8వరకు సమీప బీఎల్‌వోలను సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించాలని చెప్పారు. ఫారం 6,7,8లో వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఏఈఆర్‌వోలు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా విచారణ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజార్షిషా, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు నగేశ్‌, రమే్‌షబాబు, అంబాదాస్‌ రాజేశ్వర్‌, ఏఈఆర్‌ఓలు, ఎలక్షన్‌ విభాగపు సూపరింటెండెంట్‌, బీఎల్‌వో సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

యాసంగి తైబంద్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయండి

సంగారెడ్డిటౌన్‌, డిసెంబరు1: సంగారెడ్డి జిల్లాలో భారీ, మధ్య, చిన్ననీటి వనరుల కింద యాసంగిలో పంటల సాగుకు నీటివిడుదల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ శరత్‌ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎమ్మెల్యేలు చంటిక్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి పంటలకు రిజర్వాయర్లు, చెరువుల పరిధిలో ఆయకట్టుకు అవసరమైన నీటిపారుదల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సింగూరు రిజర్వాయర్‌ కింద 30వేల ఎకరాలకు, నల్లవాగు ప్రాజెక్టు కింద 5,100 ఎకరాలకు, 500 ఎకరాల పైబడిన 15 చెరువుల కింద 4,427 ఎకరాల ఆయకట్టులో పంటసాగుకు నీటిని విడుదల చేయడానికి అడ్వయిజరీ బోర్డు నిర్ణయించిందన్నారు. సిం గూరు, నల్లవాగు, చెరువుల మరమ్మతులు అవసరమైన చోట యాసంగికి నీటి విడుదలకు ముందే పూర్తి చేయాలన్నారు. అనంత రం అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని ప్రాజెక్టులు, చెరువుల్లో పూర్తిస్థాయి నీరుందన్నారు. అందోల్‌, పుల్కల్‌ మండలాల్లో అన్ని చెరువులు నిండినందున యాసంగిలో కొత్తగా నీటి విడుదల చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి సాగయ్యే అవకాశం ఉందని, రైతుల అవసరం మేరకు నీటిని విడుదల చేయాలని సూచించారు. సాయిబాన్‌పేట, చందంపేట, శివంపేట, కోర్పోల్‌ చెరువులకు నీరు వెళ్లే కాలువల మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్‌ పరిధిలోని కాకివాగు ప్రాజెక్టు, ఉజలంపాడు ప్రాజెక్టు కాలువల మరమ్మతులు చేపట్టాలన్నారు. నల్లవాగులో అత్యవసర కాలువ సమస్య ఉందని తక్షణమే దానిని బాగు చేయించాలన్నారు. గంగాపూర్‌, చాప్టా-బీ, వాసర్‌, గట్టులింగంపల్లి చెరువులకు కాలువ సిస్టం లేకపోవడంతో చెరువులు నిరుపయోగంగా ఉండి రైతులు పంటలు వేయలేకపోతున్నారని చెప్పారు. వెంటనే కాలువ విధానాన్ని ఏర్పాటు చేసి ఆయకట్టుకు నీటిని అందించాలని అందుకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ మురళీధర్‌, ఈఈలు మధుసూధన్‌రెడ్డి, జైభీం, విజయ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ మల్లయ్య, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నర్సింహారావు, ఆర్‌డీవోలు మెంచు నగేశ్‌, రమే్‌షబాబు, అంబదాస్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:12:33+05:30 IST