1,161 మంది పింఛన్ల కోత

ABN , First Publish Date - 2022-11-25T00:02:47+05:30 IST

కారు, భూమి, ఇల్లు.. వీటిలో ఏదైనా ఒకటి ఉండి, ఆసరా పెన్షన్‌ పొందుతున్నారా? అయితే ఇక నుంచి వారికి పెన్షన్‌ రాదు. జిల్లాలో అలాంటి వారి ఆసరా పెన్షన్లు రద్దయిపోయాయి.

1,161  మంది పింఛన్ల కోత

కొత్తగా మంజూరైన 1,411 మంది లబ్ధిదారుల పెన్షన్లు నిలుపుదల

కారు, భూమి ఉంటే ‘ఆసరా’ తొలగింపు

ఆధార్‌ నంబర్‌ సాయంతో వివరాల సేకరణ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 24 : కారు, భూమి, ఇల్లు.. వీటిలో ఏదైనా ఒకటి ఉండి, ఆసరా పెన్షన్‌ పొందుతున్నారా? అయితే ఇక నుంచి వారికి పెన్షన్‌ రాదు. జిల్లాలో అలాంటి వారి ఆసరా పెన్షన్లు రద్దయిపోయాయి. అలాగే, కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరైన వారి ఆధార నంబర్లు, బ్యాంకు ఖాతాలు సరిగా లేవన్న కారాణంతో డబ్బులు ప్రభుత్వానికి తిరిగివెళ్లాయి. సంగారెడ్డి జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 1,62,351 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఇందులో 64,281 మంది వృద్ధులు, దివ్యాంగులు 15,275 మంది, వితంతువులు 73,060 మంది, చేనేత కార్మికులు 742 మంది, గీతా కార్మికులు 863 మంది, ఒంటరి మహిళలు 7,619 మంది, బీడీ కార్మికులు 114 మంది, ఎయిడ్స్‌(ఎఆర్‌టీ), ఫైలేరియా బాధితులు 2,466 మంది ఉన్నారు. అయితే వీరిలో 1,161 మంది ఆసరా పెన్షన్లు గత నెలలో రద్దయ్యాయి. వీరిలో అన్ని కేటగిరీల వారున్నారు. వీరి పెన్షన్లు రద్దు కావడానికి ఆర్థికంగా ఉన్నవారు కావడమేనని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కార్లు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి బతుకుతున్నవారి పెన్షన్లను అధికారులు రద్దు చేశారు. అలాగే పెన్షన్లు పొందుతున్న వారి పేరిట కానీ, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏడున్నర ఎకరాల బీడు భూములున్నా, మూడు ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి ఉన్నా ఆసరా పెన్షన్‌ రద్దు చేస్తున్నారు. రద్దు ప్రక్రియను పెన్షన్లు మంజూరు చేసే పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) యంత్రాంగమే చేస్తున్నది. పెన్షన్‌ పొందుతున్న వారి ఆధార్‌ నంబర్‌ పరిశీలించి వారితోపాటు కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ వివరాల ఆధారంగానే ఆసరా పెన్షన్లను రద్దు చేస్తున్న సెర్ఫ్‌ యంత్రాంగం ప్రభుత్వ ఖజానాకు మిగులుబాటు చేస్తున్నది.

వివరాలు లేవని కొత్తవారి డబ్బులు వాపస్‌

ఇలా ఉండగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 1,411 మందకి గత జూలైలో కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి. వీరికి జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి పెన్షన్‌ డబ్బులు కూడా విడుదలయ్యాయి. అయితే వీరి బ్యాంక్‌ ఖాతాలలో పెన్షన్‌ డబ్బులు జమ చేయడానికి అవసరమైన వివరాలు సరిగా లేవు. బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌కార్డు నంబరు తదితర వివరాలు లేని కారణంగా జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి విడుదలైన ఆసరా పెన్షన్‌ డబ్బులు తిరిగి ఖజానాకు తిరిగివెళ్లాయి. వీరికి మళ్లీ సెప్టెంబర్‌, అక్టోబరు నెలల పెన్షన్‌ డబ్బులు విడుదల కాలేదు. కొత్తగా పెన్షన్‌ మంజూరై డబ్బులు పొందలేనివారు సంబంధిత అధికారులను తగిన వివరాలతో కలిస్తే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-11-25T00:03:01+05:30 IST

Read more