రూ. 100 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-10-05T04:53:39+05:30 IST

ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

రూ. 100 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి
ఆలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న కమిషనర్‌ అనిల్‌కుమార్‌

దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ వెల్లడి


పాపన్నపేట, అక్టోబరు 4: ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏడుపాయల క్షేత్రాన్ని మంగళవారం ఆయన ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ముందుగా వనదుర్గామాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పాలక మండలి చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌ వారిని సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏడుపాయలలో జరుగుతున్న దుకాణ సముదాయాల నిర్మాణ పనులను పరిశీలించారు. గిరి ప్రదక్షిణ, భక్తుల దర్శనం భవన నిర్మాణం, కాటేజీలు, తాగునీటి వసతి, వసతిగృహాలు, రహదారుల నిర్మాణాల కోసం ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం తొలిసారి ఏడుపాయలకు వచ్చినప్పటికి.. ఇప్పటికీ చాలా మరిపోయిందని అన్నారు. ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేస్తున్నామని, డిసెంబరు నెలలో పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వారివెంట దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌, ఈఈ మల్లిఖార్జున్‌, డీఈ ఓంప్రకాష్‌, ఇన్‌స్పెక్టర్‌ రంగారావు తదితరులున్నారు. 


మహిషాసురమర్ధినిగా వనదుర్గామాత దర్శనం

ఏడుపాయల వన దుర్గామాత క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజు మహార్నవమిని పురస్కరించుకుని మంగళవారం అమ్మవారు మహిషాసురమర్ధినిగా దర్శనమిచ్చారు. గర్భగుడిలో దుర్గామాతకు వేద పండితులు తెల్లవారుజామునే అభిషేకం నిర్వహించి, మెరున్‌ రంగు వస్త్రాలలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. గోకుల్‌షెడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలోనూ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పాలకమండలి చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు దంపతులు పూజల్లో పాల్గొన్నారు. దిమ్మన్నగారి శ్రీనివాస్‌, వేణు దంపతులు చండీహోమంలో పాల్గొన్నారు. అమ్మవారిని ఇంటర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, కళాశాలల రాష్ట్ర కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నేడు విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు  నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చైర్మన్‌, ఈవో తెలిపారు. 


ఏడుపాయలకు సీఎంను తీసుకుస్తా : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏడుపాయల క్షేత్రానికి ఆహ్వానిస్తానని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో శ్రీనివాస్‌, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోకుల్‌షెడ్డులోని ప్రత్యేకమండపలంలో మహార్నవమి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏడుపాయల క్షేత్రానికి సీఎం వస్తే పెద్దఎత్తున అభివృద్ధికి నిధులు వస్తాయని పేర్కొన్నారు. దుర్గమ్మ దయతో త్వరలోనే కాలేశ్వరం నీళ్లు మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా పాడిపంటలతో సస్యశ్యామలమవుతుందని తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు వెల్లడించారు ఆయన వెంట కొల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతోష్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు సంతోష్‌, డైరెక్టర్లు యాదాగౌడ్‌, బాగారెడ్డి, మాజీ డైరెక్టర్లు గౌరీశంకర్‌, యాదయ్య, ఎంపీటీసీ సిద్ధిరాములు, టీఆర్‌ఎస్‌ కౌడిపల్లి మండల అధ్యక్షుడు రామాగౌడ్‌, నాయకులు వెంకటరెడ్డి, గజినివెంకట్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-10-05T04:53:39+05:30 IST