బుస్సాపూర్‌ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ

ABN , First Publish Date - 2022-07-05T09:55:44+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం బు స్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది.

బుస్సాపూర్‌ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ

  • గ్యాస్‌ కట్టర్‌ల ద్వారా లాకర్‌రూం ధ్వంసం
  • కాలిబుడిదైన ఏడు లక్షల రూపాయల నగదు
  • 8కిలోల 30తులాల బంగారం అపహరణ
  • చోరీకి గురైన బంగారం విలువ రూ.4.39 కోట్లు
  • త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్న పోలీసులు

మెండోర, జూలై 4: నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం బు స్సాపూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 8 కి లోల 30 తులాల బంగారం అపహరణకు గురికాగా.. గ్యాస్‌కట్టర్లతో లాకర్లను తెరిచే ప్రయత్నం చేయడంతో రూ.7.3 లక్షల నగదు కాలిబూడిదైపోయింది. సోమవారం ఉదయం బ్యాంకు మేనేజర్‌ రాజేశ్వర్‌గౌడ్‌ బ్యాంకుకు వచ్చే సరికి షట్టర్‌ పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు దోపిడీకి ముందు పూర్తిస్థాయిలో రెక్కీ నిర్వహించారు. బ్యాంకు షట్టర్‌, లాకర్‌ రూమ్‌లను తెరవడానికి అవసరమైన పరికరాలను, గ్యాస్‌ కట్టర్‌లను బ్యాంకు పక్కనే ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ గదిలో దాచిపెట్టారు. ఆదివారం రాత్రి బ్యాంకు పక్కనే ఉన్న గొడ దగ్గర కు ర్చీవేసుకొని బ్యాంకు మొదటి అంతస్తులోకి వెళ్లారు. ఇనప రాడ్‌లతో షట్టర్‌ను పైకి లేపి బ్యాంకులోకి ప్రవేశించారు. మాస్కులు ధరించి లోనికి వెళ్లి సీసీ కెమెరాలకు సంబంధించిన డివైజ్‌ చానల్‌ను పగులగొట్టారు. చోరీ జ రిగితే బ్యాంకు నుంచి పోలీసు స్టేషన్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేసిన మిషన్‌ను ధ్వంసం చేశారు. 


లాకర్‌ ముందుకు వెళ్లగానే మోగే సైరన్‌ను టెక్నాలజీ ద్వారా మోగకుండా చేశారు. లోపలికి వెళ్లి.. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ను తెరిచారు. ఈ క్రమంలో మంటలు అంటుకోవడంతో లోపల ఉన్న నగదులో రూ.7.3 లక్షలు, కొ న్ని పత్రాలు కాలిపోయాయి. లాకర్‌ను తెరిచిన దుండగులు.. అందు లో ఉన్న 8 కేజీల 30తులాల బం గారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారంతో పాటు ప్రజలు లాకర్‌లలో భద్రపరుచుకున్న బంగారు ఆభరణాలు సైతం చోరీకి గురయ్యాయ ని  పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న మరో లాకర్‌ను ధ్వంసం చే యడానికి యత్నం చేసినా.. అప్పటికే వారు తెచ్చుకున్న గ్యాస్‌ అయిపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదని పోలీసులు వెల్లడించారు. కాగా.. చోరీకి వినియోగించిన గ్యాస్‌ కట్టర్‌, ఇతర పరికరాలను దుండగులు అక్కడే వదిలేసి పరారయ్యారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.39 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఈ చోరీకి పాల్పడిన దుండగులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని సీపీ నాగరాజు తెలిపారు. దుండగులు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఏటీఎంలను, బ్యాంకులను గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. త్వరలోనే దుండుగలను పట్టుకుంటామన్నారు.

Read more