పురాతన మార్కెట్లకు మహర్దశ

ABN , First Publish Date - 2022-09-24T05:39:35+05:30 IST

పురపాలక సంఘాల పరిధిలోని పాత కూరగాయల మార్కెట్లకు మహర్దశ పట్టనున్నది. 50 యేళ్లు.. అంతకన్నా ముందు నుంచి ఉన్న కూరగాయల మార్కెట్లను సహజ వారసత్వ (లైవ్‌ హెరిటేజ్‌) మార్కెట్లుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్కెట్లను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ఇవ్వనున్నది. ఈ మేరకు పురాతన మార్కెట్లను గుర్తించాల్సిందిగా మెప్మా అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌లో ఒకటి, హనుమకొండలో ఒకటి, జనగామలో ఒక మార్కెట్‌ సహజ, వారసత్వ మార్కెట్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.

పురాతన మార్కెట్లకు మహర్దశ
వరంగల్‌లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌

సహజ, వారసత్వ మార్కెట్లుగా నోటిఫైకి అవకాశం
50 యేళ్లకు పూర్వం ఏర్పాటైనవాటికి అవకాశం
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడింటి గుర్తింపు
ఎంపిక కానున్న లక్ష్మీపురం, కుమార్‌పల్లి, జనగామ మార్కెట్లు
వివరాల సేకరణలో ‘మెప్మా’ అధికారులు


పురపాలక సంఘాల పరిధిలోని పాత కూరగాయల మార్కెట్లకు మహర్దశ పట్టనున్నది. 50 యేళ్లు.. అంతకన్నా ముందు నుంచి ఉన్న కూరగాయల మార్కెట్లను సహజ వారసత్వ (లైవ్‌ హెరిటేజ్‌) మార్కెట్లుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్కెట్లను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ఇవ్వనున్నది. ఈ మేరకు పురాతన మార్కెట్లను గుర్తించాల్సిందిగా మెప్మా అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌లో ఒకటి, హనుమకొండలో ఒకటి, జనగామలో ఒక మార్కెట్‌ సహజ, వారసత్వ మార్కెట్లుగా ఎంపికయ్యే అవకాశం ఉంది.

హనుమకొండ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): 
పట్టణాల్లో పూర్వం మార్కెట్‌ సదుపాయాలు అంతగా లేని సమయంలో కూరగాయలు, మాంసాహారం, పూలు, పండ్లు, ఇతర వీధి వ్యాపారాలు ప్రభుత్వ స్థలాల్లో జరిగేవి. ప్రత్యేక సదుపాయాలు లేనప్పటికీ కాలక్రమంలో ప్రధాన మార్కెట్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బల్దియాల్లో సమీకృత మార్కెట్లను నిర్మిస్తోంది. అయితే వీధి వ్యాపారులసంఖ్య వేలల్లో ఉంటే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లో పరిమిత సంఖ్యలోనే దుకాణాలుంటాయి. మిగతా వర్తకులకు అందులో వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉండదు. భవిష్యత్తులో బల్దియా పాలకవర్గాలు అభివృద్ధి పేరిట పాత మార్కెట్లను ఖాళీ చేసి ఇతర నిర్మాణాలు చేపడితే వీధి  వ్యాపారుల ఉపాధికి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ స్థాయీ సంఘం పట్టణాల్లో వీధి వ్యాపారుల చట్టం-2014 అమలుతీరును పర్యవేక్షిస్తోంది.

వరంగల్‌ లక్ష్మీపురంలోని పాతకూరగాయల మార్కెట్‌, హనుమకొండలోని కుమార్‌పల్లి మార్కెట్‌తో పాటు జనగామ రైల్వే స్టేషన్‌ సమీపలోని కూరగాయల మార్కెట్‌ వీటిలో ఉన్నాయి. వరంగల్‌ కూరగాయల మార్కెట్‌, కుమారపల్లి మార్కెట్‌కు ఎక్కువ అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ నగర పాలక సంస్థతోపాట తొమ్మిది పురపాలక సంఘాల పరిధిలోని కూరగాయల మార్కెట్ల పూర్తి వివరాలను పంపేందుకు మెప్మా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

50 యేళ్ల కిందటి..
వీధి వ్యాపారుల చట్టం - 2014 అమలులో భాగంగా పురపాలికల్లో 50 ఏళ్లకు పైబడిన మార్కెట్ల వివరాలను, అక్కడ ప్రస్తుతం కల్పిస్తున్న సదుపాయాలతో పూర్తి వివరాలను పంపాలని పార్లమెంట్‌ స్థాయీ సంఘం కోరింది. ఈ మార్కెట్లను సహజ వారసత్వ (లైవ్‌ హరిటేజ్‌) మార్కెట్లుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇది అమలైతే వాటికి మహర్దశ పట్టనున్నది. అక్కడ వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడంతో పాటు వీధి వ్యాపారుల ఉపాధికి భద్రత లభిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పంపాల్సిందిగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లకు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది.

ప్రయోజనాలు
పాత మార్కెట్లను సహజ వారసత్వ మార్కెట్లుగా కేందం గుర్తించినట్లయితే దానికి ప్రత్యేక హోదా లభిస్తుంది. బల్దియా పాలకవర్గాలు పాత మార్కెట్లను నోటిఫై చేస్తే అవి వారసత్వ, సహజ మార్కెట్లుగా పరిగణలోకి వస్తాయి. వీధి వ్యాపారాలు చేసుకునేందుకు భద్రత లభిస్తుంది. చిరువ్యాపారులను ఇతర చోటికి తరలించే పరిస్థితి ఉండదు. వ్యాపారేతర అవసరాల కోసం స్థలాలను వినియోగించరాదు. ఇతర నిర్మాణాలు చేపట్టరాదు. వ్యాపారుల సౌకర్యార్ధం షెడ్లను నిర్మించాల్సి ఉంటుంది. తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వీధి దీపాల ఏర్పాటు తదితర వసతులను కల్పించాల్సి ఉంటుంది.

ప్రత్యేక ఫార్మాట్‌
పాత మార్కెట్ల వివరాల సేకరణకు కేంద్ర ప్రభు త్వం ప్రత్యేకంగా ఒక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇందులో ఆ మార్కెట్‌ పేరు, అది ఉన్న ప్రాంతం, అది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది. మొదట్లో ఎంత విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఎంత మేరకు విస్తరించింది. అందులో విక్రయించే  కూరగాయలు, మాం సం, చేపలు ఇతరత్రా వాటి వివరాలు, ప్రస్తుతం ఆ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న లైసెన్సుడు చిరువ్యాపారులు, ఆ మార్కెట్‌పై ఆధారపడి  వ్యాపారాలు చేసుకుంటున్న ఇతరత్రా చిరువ్యాపారులు, భవిష్యత్‌లో మార్కెట్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు, మార్కెట్‌లో మౌలిక సదుపాయాలు సమాచారాన్ని ఆ ఫార్మాట్‌లో పొందుపరిచి పంపాల్సి ఉంటుంది.

మార్కెట్లు ఇవే..

వరంగల్‌లోని లక్ష్మీపురం, హనుమకొండలోని కుమార్‌పల్లి మార్కెట్‌, జనగామలోని కూరగాయల మారెట్లను కేందం నోటిఫైచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని సహజ, వారసత్వ మార్కెట్లుగా నోటిఫై చేస్తే వ్యాపారుల ఉపాధి భద్రత లభించడంతో పాటు వీటిల్లో మరిన్ని వసతులను కల్పించేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా నిధులు విడుదలు అవుతాయి. అలాగే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ మహానగర పాలక సంస్థతో పాటు తొమ్మిది పురపాలక సంఘాలు - జనగామ, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి, పరకాల ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం ఉన్న పాత మార్కెట్లలో కొన్ని పాతవికాగా, కొన్ని ఈ మధ్య కాలంలో ఏర్పాటు అయ్యాయి. ఆయా జిల్లాల మెప్మా అధికారులు ఈ మార్కెట్ల వివరాలను సేకరించి పంపనున్నారు.

Read more