దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే..

ABN , First Publish Date - 2022-09-17T05:40:34+05:30 IST

దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే..

దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే..
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

సచివాలయానికిఅంబేద్కర్‌ పేరు పెట్టారు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

కాళోజీ జంక్షన్‌ (హనుమకొండ), సెప్టెంబరు 16: దళితుల ఓట్లను కొల్లగొట్టడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్రటేరియట్‌కు అంబేద్కర్‌ పేరును పెడుతున్నారని, ఆయనపై గౌరవంతో కాదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీకి వత్తాసు పలికే దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కీర్తిస్తూ క్షీరాభిషేకాలు చేస్తున్నారని మంద కృష్ణ విమర్శించారు. ఆయనకు దళితులపై  ప్రేమ ఉన్నట్లు భావించి అల్ప సంతోషులుగా కొందరు కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారని అన్నారు. కానీ ఆయన వైఖరి వల్లనే దళితులు తీవ్రంగా నష్టపోతున్నారని అందరూ గుర్తించాలన్నారు. 

దేశానికి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం పనికిరాదని, కొత్త రాజ్యాంగానికి ఆయన పిలుపునిచ్చిన విషయం దళితులు మరిచిపోవద్దని అన్నారు. అంతేగాక తాను కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు మళ్లీ కూడా ప్రకటించారని మంద కృష్ణ అన్నారు. సామాజిక న్యాయం కోరుకునే వారికి రాజ్యాంగమే ముఖ్యమని, పేరు కాదని అన్నారు. పేరు పెడతామనగానే కేసీఆర్‌కు క్షీరాభిషేకాలు చేస్తున్న నాయకులు, రాజ్యాంగాన్నే మారుస్తామంటున్న కేసీఆర్‌ వైఖరిపట్ల ఎందుకు మౌనంగా ఉంటున్నారో జవాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

 గత సంవత్సరం ఐదు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ప్రస్తుతం మరో ఐదు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని చట్టం తీసుకొచ్చారని తెలిపారు. దీనితో అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసినట్లు కాదా అని మంద కృష్ణ ప్రశ్నించారు. 

రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ప్రయివేట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయకుండా వాటిని ప్రభుత్వ యూనివర్సిటీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో పది రోజులపాటు గ్రామ గ్రామాన ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఎంఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీ్‌పకుమార్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మంద కుమార్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Read more