మెతుకు సీమలో మహా సాగరం

ABN , First Publish Date - 2022-02-23T08:55:29+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం..

మెతుకు సీమలో మహా సాగరం

నేడు మల్లన్న సాగర్‌ను ప్రారంభించనున్న సీఎం

తుక్కాపూర్‌ పంపుహౌస్‌ మోటార్లు ఆన్‌.. సారె సమర్పణ

6 వేల కోట్ల వ్యయం.. 50 టీఎంసీల సామర్థ్యం

10 జిల్లాల సాగు, తాగు అవసరాలకు నీరు

జాతీయ హోదాకు బీజేపీ ఎంపీలు నిలదీయాలి

మాది పాలమూరు గోస.. వారిది పాకిస్థాన్‌ ఽధ్యాస: మంత్రి హరీశ్‌

ఇది చిరస్మరణీయమైన రోజు: మంత్రి కేటీఆర్‌


సిద్దిపేట, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పంపుహౌజ్‌ను పరిశీలించి మోటార్లు ఆన్‌ చేస్తారు. ఈ మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి దుంకుతున్న జలాలకు శాస్త్రోక్తంగా సారె సమర్పిస్తారు. పూలు, పండ్లు, వస్ర్తాలతో అభిషేకిస్తారు. అనంతరం సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలతో సీఎం పర్యటన ముగుస్తుంది.


1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు

17,600 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ను నిర్మించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి 10 జిల్లాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. అనేక వివాదాల నడుమ నిర్మాణం పూర్తయిన ఈ రిజర్వాయర్‌ను సీఎం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. కాగా, రిజర్వాయర్‌కు కొమురవెల్లి మల్లన్న పేరు పెట్టడంతో సంబంధిత అధికారులు మంగళవారం ఉదయం కొమురవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


తెలంగాణకు నేడు చిరస్మరణీయం: కేటీఆర్‌

హింస ఏ రూపంలో ఉన్నా ఖండిస్తామన్న మంత్రి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం ప్రారంభిస్తున్న రీత్యా.. ఈ బుధవారం రాష్ట్రానికి చిరస్మరణీయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని తెలిపారు. కాగా, మత హింసను నియంత్రించ లేని స్థితిలో కర్ణాటకలో బీజేపీ అసమర్థ పాలన సాగిస్తున్నదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘‘కర్ణాటకలో హిందువు చనిపోతే స్పందించరా?’’ అంటూ ఓ వ్యక్తి ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ స్పందిస్తూ, హింస ఏ రూపంలో ఉన్నా తాను ఎల్లప్పుడూ ఖండిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా మతహింసను వ్యతిరేకిస్తానని వివరించారు. కర్ణాటక శివమొగ్గలో బజరంగ్‌దళ్‌ కార్యకర్తను హత్య చేసిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు బదులిచ్చారు.


నదికే నడక నేర్పిన కేసీఆర్‌ : హరీశ్‌

‘‘ఎక్కడైనా నదికి అడ్డంగా రిజర్వాయర్లను నిర్మిస్తుంటారు. కానీ నది ప్రవాహం లేని చోట.. దేశంలో ఎక్కడా లేనివిధంగా జలాశయాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. కేసీఆర్‌.. నదికే కొత్త నడక నేర్పారు. బీడువారిన తెలంగాణ బతుకుల బాధ తీర్చారు’’ అని మంత్రి హరీశ్‌ అన్నారు. మల్లన్నసాగర్‌ను బుధవారం సీఎం ప్రారంభించనుండడంతో పర్యటన వివరాలతో పాటు రిజర్వాయర్‌ నేపథ్యాన్ని మంత్రి మంగళవారం తుక్కాపూర్‌లో విలేకరుల సమావేశంలో వివరించారు. తెలంగాణకు నడిగడ్డలో మల్లన్నసాగర్‌ను నిర్మించారని.. ఇక్కడినుంచి ఏ మూలకైనా నీళ్లు వెళతాయని చెప్పారు. 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేలా మల్లన్న సాగర్‌ నిర్మాణం జరిగిందన్నారు. ఈ రిజర్వాయర్‌తో సగం తెలంగాణ సస్యశామలంగా మారుతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఓ ఇంజనీర్‌లా వ్యవహరించి.. గోదావరి నీరు సముద్రంలో కలవకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములకు మళ్లించారని గుర్తుచేశారు. ఈ రిజర్వాయర్‌కు పునాది వేసినపుడు నీళ్లేరావని.. కలలో కూడా కట్టరని విమర్శలు చేశారని మంత్రి అన్నారు.ఆ విమర్శలకు తమ పనితనమే సాక్ష్యమన్నారు. 


కాళేశ్వరంపై బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

కేసీఆర్‌ ఒక విజన్‌తో నీళ్లు పారిస్తుంటే.. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టి రక్తం పారిస్తున్నారని హరీశ్‌ ఆరోపించారు. ‘‘మాది పాలమూరు గోస అయితే వారు పాకిస్థాన్‌ ఽధ్యాస పెట్టుకుని అభివృద్దిని విస్మరించారు. కర్ణాటకలోని అప్పర్‌భద్ర, మధ్యప్రదేశ్‌లోని కెన్‌ బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదాలు కల్పించి.. కాళేశ్వరాన్ని ఎందుకు విస్మరించారు? దీనిపై బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి’’ అని సూచించారు. చరిత్రలో నిలిచిపోయే మల్లన్నసాగర్‌ ప్రారంభ ఘట్టాన్ని చూసి హర్షించాలని హితబోధ చేశారు.

Updated Date - 2022-02-23T08:55:29+05:30 IST