వరకట్న వేధింపులు భరించలేక..

ABN , First Publish Date - 2022-03-17T05:28:16+05:30 IST

వరకట్న వేధింపులు భరించలేక..

వరకట్న వేధింపులు భరించలేక..
మృతి చెందిన అనూష,

ఉరివేసుకొని బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

భర్తే హత్య చేశాడంటున్న పుట్టింటి వారు

హత్యానేరం కింద కేసు నమోదు

మృతురాలికి రెండేళ్ల కుమారుడు.. ప్రస్తుతం నాలుగు నెలల గర్బిణి...

హనుమకొండ టౌన్‌, మార్చి 16: మంచి ఉద్యోగం.. రెండేళ్ల కుమారుడు.. కడుపులో మరొక బిడ్డ. కానీ  ఏ మి జరిగిందో ఏమో కానీ బ్యాంకు ఉద్యోగి అనూష (28) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది.  అయితే మరణంపై పుట్టింటి వారు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. భర్త అదనపు కట్నం కోసం వేధించేవాడని, అతడే తమ కూతురును పొట్టనపెట్టుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మంగళవారం బ్యాంక్‌ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం..

ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన జాటోతు అమ్రు - చంద్రమ్మల కూతురైన అనూషను.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన లావుడ్య ప్రవీణ్‌నాయక్‌తో 2019లో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.20లక్షల కట్నం ఇచ్చారు. ప్రవీణ్‌నాయక్‌ యూనియన్‌ బ్యాంకు న్యూశాయంపేట బ్రాంచ్‌లో మేనేజరుగా, అనూష యూనియన్‌ బ్యాంకు రెడ్డిపురం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బ్యాంక్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. 

అయితే వివాహం అయిన కొద్దిరోజులకే ప్రవీణ్‌ అదనపు కట్నం కోసం భార్య అనూషపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో అదనంగా 20తులాల బం గారం, టీవీ, ఫ్రిడ్జ్‌ ఇచ్చారు. పదిహేను రోజుల కిందట అనూష భర్త ప్రవీణ్‌ మరింత కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. మరో ఎకరం స్థలం కావాలని అనూషను వారింట్లో దింపేసి వచ్చాడు. అనూష కుటుంబసభ్యులు పెద్దమనుషుల సమక్షంలో స్థలం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఇంటికి పంపించారు. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ప్రవీణ్‌ అనూష తో మళ్లీ గొడవకు దిగాడు. భర్త వేధింపులు తట్టుకోలేని అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మం గళవారం రాత్రి 11గంటల సమయంలో ప్రవీణ్‌నాయక్‌ పోలీసులకు సమాచాం ఇవ్వగా సీఐ జనార్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు సతీష్‌, సంపత్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. 

బుధవారం హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఎంజీఎంను సందర్శించి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యానేరం (304-బి) కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టనున్నారు. ప్రవీణ్‌నాయక్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు కాగా, వీరంతా పోలీస్‌ కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం. కాగా అనూషకు రెండు సంవత్సరాల బాబు ఉండగా, ప్రస్తుతం నాలుగు మాసాల గర్బిణి. 

భర్తే చంపాడని ఆందోళన

ప్రవీణ్‌నాయక్‌ కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం అనూషను వేధిస్తున్నాడని, అనూషను అతడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురా లి తల్లిదండ్రులు చంద్రమ్మ, అమ్రు, సోదరుడు వీరన్న అరోపిస్తున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం కేయూ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రవీణ్‌నాయక్‌ను శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  విచారణ చేసి తగు న్యాయం చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో అనూష కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.Read more