జైపాల్‌ రెడ్డి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-10-12T04:28:46+05:30 IST

‘ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి చివరివరకు వాటిని ఆచరించిన మహావ్యక్తి జైపాల్‌రెడ్డి. ఆయన చూపిన మంచి మార్గంలో పయనించడమే నేటి తరం, నవతరం, యువతరం ఆయనకిచ్చే నివాళి.’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

జైపాల్‌ రెడ్డి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి
జయప్రకాష్‌ నారాయణ్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న వెంకయ్య నాయుడు; చిత్రంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, జేపీఎన్‌ సీఈ చైర్మన్‌ రవికుమార్‌

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

జేపీఎన్‌సీఈ ఆవరణలో జైపాల్‌రెడ్డి విగ్రహం ఆవిష్కరణ


మహబూబ్‌నగర్‌/విద్యావిభాగం(ఆంధ్ర జ్యోతి), అక్టోబరు 11: ‘ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి చివరివరకు వాటిని ఆచరించిన మహావ్యక్తి జైపాల్‌రెడ్డి. ఆయన చూపిన మంచి మార్గంలో పయనించడమే నేటి తరం, నవతరం, యువతరం ఆయనకిచ్చే నివాళి.’ అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. లోక్‌నా యక్‌ జయప్రకాష్‌ నారాయణ 120వ జయంతి, మహబూబ్‌నగర్‌లోని జయ ప్రకాష్‌ నారాయణ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు మంగళవారం ఆవిష్క రించారు. రాష్ట్ర మంత్రులు ఎస్‌.నిరం జన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీఎన్‌ ఈసీ చైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకయ్య నాయుడు మాట్లా డారు. జైపాల్‌రెడ్డి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడేవారని, ఆయన వాక్చాతుర్యం గొప్పదని కొనియాడారు. పట్టుదలతో దేశ రాజకీయాల్లో కీలక స్థాయికి వచ్చారని అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో అనుకున్న లక్ష్యానికి చేరాలని సూచించారు. అబ్ధుల్‌కలాం పేర్కొన్నట్లు కలలు కనాలని, వాటి సాకారం కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. మాతృ భాషను అందరూ గౌరవించాలని చెప్పారు. ప్రాథ మిక, హైస్కూల్‌ దశ వరకు మాతృ భాషలోనే విద్యాబోధన సాగాలని ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, తాను, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కూడా మాతృ భాషలోనే అభ్యసించి ఈస్థాయికి వచ్చామని వివరించారు. మాతృ భాషని, మాతృ భూమిని, మరచిన వాడు మానవుడే కాదన్నారు. 


వ్యక్తిగా దేశంలో అందరివాడు: మంత్రి నిరంజన్‌రెడ్డి

వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఎందరినో ప్రభావితం చేశారని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, సామీప్యతతో ప్రభావితులైన వారు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. వారి ప్రాభవంతో జైపాల్‌రెడ్డి, వెంకయ్య నాయుడు ఆనాడు ఉద్యమించారని పేర్కొన్నారు. జైపాల్‌ రెడ్డి సిద్థాంత పరంగా, రాజకీయంగా విబేధించినా వ్యక్తిగా దేశంలో ఆయన అందరివాడని కొనియాడారు. జైపాల్‌రెడ్డి, జయప్రకాష్‌ నారాయణ స్మారకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.


విలువలు నెలకొల్పిన నేత: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడిగా జైపాల్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జైపాల్‌రెడ్డితో సమావేశమై, ఉద్యమ ఆకాంక్షలు ఆయనకు తెలియజేసేవారమని వెల్లడించారు. తెలంగాణ ప్రకటన వచ్చే సమయంలో రాయల తెలంగాణ అంశం చర్చకు వచ్చినప్పుడు తాము పది జిల్లాల తెలంగాణే ఇవ్వాలని జైపాల్‌ రెడ్డికి చెప్పామన్నారు. అందుకోసం ఆయన అప్పట్లో కేంద్ర నాయకత్వంతో మాట్లాడి మనం కోరుకున్న తెలంగాణనే వస్తుందని తనకు భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. మరో సందర్భంలో కల్వకుర్తి ఎత్తిపోతల కింద కనీసం 5 టీఎంసీల జలాశయం కూడా లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళితే, ఈ ప్రాంతం నుంచి బలమైన డిమాండ్‌ వచ్చినప్పుడు అలా ప్రకటించి వదిలేస్తారే తప్ప పనిచేయరని అన్నారన్నారు. ప్రస్తుతం ఆయన బతికున్నట్లయితే కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఇవాళ సస్యశ్యామలవుతున్న పాలమూరును చూసి సంతోషపడేవారని అన్నారు. 


కన్నీరు పెట్టిన రవికుమార్‌

సభ ప్రారంభంలో తాము ఈ కాలేజీ స్థాపించడానికి అన్నివిధాలా సహకరించిన తన మార్గదర్శి అంటూ జైపాల్‌రెడ్డిని తలచుకొని జేపీఎన్‌ఈసీ చైర్మన్‌ రవి కుమార్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు. తాను కేవలం పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు కోసం వెళితే, తనను ఇంజనీరింగ్‌ కాలేజీ పెట్టాలని ప్రోత్సహించడమే కాకుండా అన్నివిధాలా సహకరించి, తమ ఎదుగుదలకు ముం దున్న వ్యక్తి జైపాల్‌రెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమించిన ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఫొటో దిగారు. వారందరినీ వెంకయ్య నాయుడికి పరిచ యం చేశారు. అదేవిధంగా కాలేజీ 25వ వార్సికోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 75 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మీ, సోదరుడు పద్మారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నరసింహులు, సినీ నిర్మాత బసిరెడ్డి, జేపీఎన్‌ఈసీ కార్యదర్శి వెంకటరామారావు, భాస్కర్‌, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, పద్మజారెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్‌ సుజీవన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read more