నేడు మృగశిర కార్తె

ABN , First Publish Date - 2022-06-08T04:50:25+05:30 IST

వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ చేసుకుం టారు.

నేడు మృగశిర కార్తె

 నారాయణపేట, జూన్‌ 7: వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ చేసుకుం టారు. రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతారు. నాటు కోడి కూర తినడానికి మక్కువ చూపుతారు. ఖరీఫ్‌ సేద్యం కోసం రైతులు ఉగాది తర్వాత దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకుంటారు. రోహిణి కార్తెలో కురిసే మోస్తరు వానలకు ఆరుతడి పంటలైన కంది, పెసర వేస్తారు. జూన్‌ మొదటి వారంలో వచ్చే మృగశిర కార్తెలో మిగతా ఖరీఫ్‌ పంటలు వేస్తారు. ఇన్నాళ్లూ వేసవి వల్ల ఉక్కపోతతో సతమతమైన పల్లెలు, పట్టణ వాసులు మృగశిర కార్తె రోజు కురిసే తొలకరి జల్లులతో వేసవి తాపం తగ్గుతుందని గ్రామస్థుల నమ్మకం.


మాంసాహారం..

మృగశిర కార్తెన గ్రామీణులు మిరుగు కార్తెగా అభివర్ణిస్తారు. ఆ రోజు ఇళ్లలో తప్పని సరిగా ప్రత్యేక మాంసాహారాలు చేసుకుంటారు. మృగశిర ప్రవేశంతో వాతావరణం చల్లబడటంతో ఆ చలిని తట్టుకునేందుకు విధిగా నాటు కోడి మాంసాన్ని తింటారు. మాంసంతో పాటు సాయంత్రం మద్యం, కల్లును సేవిస్తారు. శాఖాహారులు తీపి వంటకాలతో పాటు ఇంగువ, బెల్లం గుళికలను మింగుతారు. వంటకాల్లో వేడిని పెంచేందుకు ఇంగువను వాడతారు.


కొండెక్కిన కోడి ధరలు

ఈసారి కోడి ధరలు కొండెక్కడంతో మృగశిర కార్తెను చేసుకునే వారికి ఆర్థిక భారం కానుంది. నాటు కోళ్లు లైవ్‌ కేజీ ధర రూ.500, ఫారం కోళ్లు లైవ్‌ కేజీ ధర రూ.140గా ఉంది. చికెన్‌ కేజీ రూ.240, స్కిన్‌లెస్‌ కేజీ రూ.300గా ధరలు ఉన్నాయి.

Updated Date - 2022-06-08T04:50:25+05:30 IST