ఇంటిస్థలం అందని ద్రాక్షే

ABN , First Publish Date - 2022-03-16T07:06:39+05:30 IST

సామాన్య, మధ్యతరగతి వర్గాలవారికి సొంతింటి కల కలగానే మిగులుతోంది.

ఇంటిస్థలం అందని ద్రాక్షే

సామాన్య, మధ్యతరగతి వర్గాలవారికి సొంతింటి కల కలగానే మిగులుతోంది. ప్రభుత్వం అమ్ముతోన్న ఓపెన్‌ప్లాట్ల వేలంలో సైతం వీరికి స్థలాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల్లోని హౌసింగ్‌ బోర్డు కు సంబంధించిన రాజీవ్‌స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు ప్రభుత్వం నిర్ధారించిన కనీస ధర కంటే మూడురెట్లు అధికంగా పలికింది. ప్రభుత్వానికి కాసులు కురుస్తున్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి వర్గాలవారికి మాత్రం నిరాశే మిగిలింది.

-- ప్రభుత్వ వేలం పాటల్లోనూ రియల్‌ హవా

- మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల్లో 

     రాజీవ్‌ స్వగృహ ఇళ్ల స్థలాల వేలంలో దుస్థితి 

- ధరలు భారీగా పెరగడంతో నిరాశలో సామాన్యులు

-  వెంచర్లలో ప్లాట్ల ధరలు తగ్గొద్దనే వ్యూహం

- మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా చదరపు గజానికి రూ.26,650,   

   గద్వాలలో  రూ.14,500 పలికిన ధర

- ఇలాగైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన


 మహబూబ్‌నగర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  తెలంగాణ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు సంస్థ పరిధిలోని రాజీవ్‌ స్వగృహకు సంబంధించి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ సమీపంలోని సారిక టౌన్‌షిప్‌, గద్వాలలోని అంబర్‌ టౌన్‌షిప్‌లలో ఉన్న ఓపెన్‌ప్లాట్ల వేలం ప్రారంభించారు. ఈ వేలంలో రియల్‌ వ్యాపారులు, వారి ఏజంట్లు  చొరబడి ధరలు పెంచేయడంతో సామాన్యుల సొం తింటి కల అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రధానంగా మహబూబ్‌నగనర్‌, గద్వాల జిల్లా కేంద్రాలలో  ఇప్పటికే పుట్ట గొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. ఆ వెంచర్లలో  సాధారణ మార్కెట్‌ ధరకంటే మూడురెట్లు అదనంగా ధర నిర్ణయించ డంతో ఏ వెంచర్‌లో చూసినా 20శాతానికి మించి ప్లాట్లు అమ్ము డు పోలేదు. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ తగ్గకుండా చూసుకునేలా ఈ ప్లాట్ల వేలంలో పాల్గొని రేట్లు పెంచేశారనే  ఆరోపణలు వస్తున్నాయి.  

 మహబూబ్‌నగర్‌లో చదరపు గజానికి కనీస ధర రూ. 8వేలు నిర్ధారించగా, గద్వాలలో చదరపు గజానికి కనీస ధర రూ.5500 నిర్ణయించారు. అంతకంటే 25 నుంచి 30శాతం వరకు వేలంలో ధర పెరిగితే అది రీజనబుల్‌గా ఉండేదని, కానీ రియల్‌ వ్యాపారుల ప్రమేయంతో అదికాస్తా హద్దులు దాటి రియల్‌ వ్యాపారాన్ని తలదన్నేలా ఉందని సామాన్యులు వాపోతున్నారు.

 మూడింతలు పెరిగిన ధర

అమిస్తాపూర్‌ వద్ద ఉన్న రాజీవ్‌స్వగృహ సారిక టౌన్‌షిప్‌లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాన్నంటాయి. ఇక్కడ రియల్‌ వ్యాపారులు చొరబడటంతో సామాన్య, మధ్యతరగతి వారికి ప్లాట్లు దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొదటిరోజు సోమవారం 60 ప్లాట్లకు వేలం నిర్వహించగా, కనిష్టంగా రూ.15,500 గరిష్టంగా రూ.26,650 ధర పలికింది. సగటున రూ.20 వేల నుంచి రూ.22వేల వరకు ధర వచ్చింది. రెండోరోజు రెసిడెన్షియల్‌ ప్లాట్ల కు  సైతం ఇదే హవా నడిచింది. కనిష్టంగా రూ.9,500 పలికితే గరిష్టంగా రూ.21,800వేల వరకు పలికింది. హెచ్‌టీ లైన్లున్న ప్లాట్ల వరకే రూ.9,500 నుంచి రూ.13500వేల వరకు ధర పలికితే మిగిలిన ప్లాట్లకు రూ. 18వేల పైనుంచి 20వేల వరకు సగటు ధర పలికింది. మొత్తంగా రియల్‌ వ్యాపారులు, వారి ఏజంట్లే  అధిక ధరలు పాడడంతో ఒకరిద్దరు మధ్య తరగతివా రు తప్పవేలంలో పాల్గొన్న ఇతర సామాన్యులు ప్లాట్లు కొన లేకపోయారు. గరిష్ట ధర రూ.14 నుంచి రూ.16 వేల మధ్య వరకు ప్లాట్ల కోసం పోటీపడ్డ మధ్యతరగతి వారు ఆ తర్వాత వేలంలో పాల్గొనకుండా చేతులెత్తేసి నిరాశతో వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. రెండోరోజువేలం సమయంలో 14,15వ తేదీ డీడీలు తీసినవారిని కూడా అనుమతించడంతో  కొంతసేపు అభ్యంతరాలు తెలిపారు. తొలుత ప్రకటించిన ప్రకారం 13వ తేదీ వరకు తీసిన డీడీలు ఉన్న వారినే వేలంలోకి అనుమతి స్తామని పేర్కొనడం ఈవివాదానికి కారణమైంది. అయితే 14,15వ తేదీల్లో కూడా డీడీలు తీసినవారిని వేలానికి అనుమ తించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అదనపు కలెక్టర్‌ పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. 

  గద్వాలలోనూ పెరిగిన ధరలు:

 గద్వాల మునిసిపాలిటీ పరిధిలోని నదీ అగ్రహారం సమీపంలో ఈ టౌన్‌షిప్‌ ఉంది. జిల్లా కేంద్రమైన తర్వాత గద్వాలలో రియల్‌ బూమ్‌ వ్యాపించింది. పంట పొలాలను సైతం వెంచర్లుగా విభజించి చదరపు గజాల లెక్కన విక్రయిస్తు న్నారు.  ఈ మెయిన్‌రోడ్డు నుంచి నదీ అగ్రహారం వెళ్లే మార్గం లో సైతం దాదాపు ముప్పై వరకు వెంచర్లు వెలిశాయి.  ఈ ప్రాంతంలోని వెంచర్లలో ఇళ్లస్థలాలు కొనాలంటే గరిష్టంగా చదరపు గజానికి రూ. 7వేల నుంచి రూ.8వేలలోపే ఉంది. ఈ మార్కెట్‌ సర్వే ఆధారంగానే ప్రభుత్వ టౌన్‌షిప్‌లో ఉన్న ఓపెన్‌ ప్లాట్లకు ప్రభుత్వ ధరను చదరపు గజం రూ.5,500కు నిర్ణయిం చింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు, చిరుద్యోగులు ఇక్కడ ప్లాటు కొనుక్కుందామనే ఆశతో డీడీలు తీసి వేలం పాటకు వెళ్లారు.  రియల్టర్లు ప్రైవేట్‌ వ్యాపారానికి దెబ్బతగలకుండా ఇక్కడ ప్లాట్లకు వేలంలో అత్యధికంగా పాడుతూ ధరను పెంచేశారు. దీంతో సామాన్యులు ఈ ప్లాట్లను తాము కొనలేమంటూ 8,500 ధర దాటిన తర్వాత వేలం నుంచి నిష్క్రమిస్తూ కనిపించారు. గద్వాలలో అంబర్‌ టౌన్‌షిప్‌లో మొదటి రోజు కమర్షియల్‌, మల్టీపర్పస్‌ 58 ప్లాట్లకు వేలం నిర్వహించగా, కనిష్టంగా రూ.6600 ధర పలికితే, గరిష్టంగా 14,800, సగటున రూ.10వేల నుంచి 12వేల వరకు ధర పలికింది. రెండోరోజు రెసిడెన్షియల్‌ ప్లాట్లకు సంబంధించి మొత్తం 69 ప్లాట్లకు వేలం వేయగా, కనిష్టంగా రూ.5600 పలికితే గరిష్టంగా రూ.13,700 సగటున రూ.9వేల నుంచి రూ.11వేల వరకు ధర పలికింది. గరిష్ట ధర 8వేల వరకు ఉంటే మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ప్లాట్లు దక్కేవని వాపోతున్నారు.   

Updated Date - 2022-03-16T07:06:39+05:30 IST