సీఎంను విజయం వరించాలి

ABN , First Publish Date - 2022-10-03T04:29:21+05:30 IST

‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చారు. దేశాన్ని కూడా సరైన దిశలో నడిపేందుకు బయలుదేరుతున్న ఆయనకు విజయం వరించాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కుకున్న.’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు అమ్మవారి కల్యాణ్యం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

సీఎంను విజయం వరించాలి
అమ్మవారికి పట్టు వస్ర్తాలు తీసుకొస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం

కేసీఆర్‌కు దేశ స్థాయిలో సక్సెస్‌ కావాలి 

జోగుళాంబ అమ్మవారిని అదే కోరుకున్న 

మంత్రి నిరంజన్‌రెడ్డి 

అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ


అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 2: ‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చారు. దేశాన్ని కూడా సరైన దిశలో నడిపేందుకు బయలుదేరుతున్న ఆయనకు విజయం వరించాలని జోగుళాంబ అమ్మవారిని మొక్కుకున్న.’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు అమ్మవారి కల్యాణ్యం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయనతో పాటు జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు పాల్గొన్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్‌, ఆలయ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, అర్చకులతో కలిసి పుర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. 


దేశాన్ని నడిపించే బాధ్యత

ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చామని, నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ఇక దేశాన్ని కూడా సరైన దిశలో నడింపించాల్సిన బాధ్యత కేసీఆర్‌ తీసుకోబోతున్నారని చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ మేలు జరిగేలా ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు. అందులో సఫలీకృతులు కావాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఆ రోజు తెలంగాణ సాధనలో భాగంగా సీఎం అమ్మవారి వద్ద నుంచే పాదయాత్ర మొదలు పెట్టి, రాష్ర్టాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఆయనకు విజయం చేకురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు బండారి భాస్కర్‌, తిరుపతయ్య, చెన్నిపాడు అనంతేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. 


ఏపీ సర్కారు పట్టువస్ర్తాలు 

తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం జోగుళాంబ అమ్మవారికి ఏపీ సర్కారు నుంచి పట్టువస్ర్తాలు అందాయి. ఆదివారం కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్‌ ఆదిశేషునాయుడు వచ్చి అమ్మవారికి వస్ర్తాలు సమర్పించారు. వారికి ఆలయ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్‌, అర్చకులు పుర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజలు చేశారు.


ఘనంగా కల్యాణం

అలంపూర్‌: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వాముల కల్యాణం ఆదివారం ఉదయం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అబ్రహాం దంపతులు హాజరై తలంబ్రాలు పోశారు. కల్యాణాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుచి భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. సాయంత్రం అమ్మవారిని సింహ వాహనంలో ఉంచి మాడ వీధులలో ఊరేగించారు. 


కాళరాత్రిదేవిగా అమ్మవారు 

శరన్నవరాత్రులలో భాగంగా ఏడో రోజు ఆదివారం జోగుళాంబ అమ్మవారు కాళరాత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి భయానక రూపాల్లో ఇది ఒకటి. కాళరాత్రిదేవి పగలు రాత్రి పాలిస్తుందని, ఆమె కిరీటాన్ని సహస్ర చక్రమని పిలుస్తారు.

Read more