పల్లె దవాఖానాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-11-30T23:49:07+05:30 IST

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది.

పల్లె దవాఖానాలపై ప్రత్యేక దృష్టి
పైపాడులోని పల్లె దవాఖానాలో వైద్య సేవలందిస్తున్న ఆయుష్‌ వైద్యురాలు (ఫైల్‌)

- వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు సన్నాహాలు

- ఆయుష్‌ డాక్టర్లతో భర్తీ చేసేందుకు చర్యలు

- వారికి ఆరునెలల పాటు శిక్షణ

గద్వాల క్రైం, నవంబరు 30 : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆసుపత్రుల్లో పని చేసేందుకు ఎంబీబీఎస్‌ వైద్యులు ముందుకు రాకపోవడం సమస్యగా మారింది. వారికి బదులుగా ఆయుష్‌ వైద్యులను నియమించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. అలోపతి వైద్యం అందిం చేలా వారికి ఆరు నెలల పాటు శిక్షణ నిచ్చేందుకు సిద్ధమవుతోంది.

15 దవాఖానాల్లో వైద్యుల కొరత

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద జోగుళాంబ గద్వాల జిల్లాలోని 40 గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసింది. వాటిలో 15 ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. మిగిలిన 25 దవాఖానాలలో ఎంబీబీఎస్‌ వైద్యులు ఎనిమిది మంది, ఆయుష్‌ వైద్యులు 17 మంది ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గత ఏడాది వీటిని ప్రారంభించినప్పటికీ ఈ దవాఖానాల్లో ఇచ్చే రూ.40 వేల జీతానికి ఎంబీబీఎస్‌ వైద్యులు ముందుకు రావడం లేదు. వారి స్ధానంలో ఆయుష్‌ డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటోంది. వారికి అలోపతి వైద్యంపై ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

గ్రామీణ ప్రజలకు ప్రయోజనం

ఈ దవాఖానాల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమిస్తే గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. సీజనల్‌ జ్వరాలు, ఇతర జబ్బులకు ఈ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు, అవసరమైన సూచనలు ఇస్తారు. అలాగే పరిస్థితి తీవ్రం గా ఉన్న వారిని సమీపంలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేసి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఈ దవాఖానాల్లో అవ సరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.

నాలుగు ఆసుపత్రులకే సొంత భవనాలు

జిల్లాలో 40 పల్లె దవాఖానాలు ప్రారంభమైనా, వాటిలో నాలుగు ఆసుపత్రులకే సొంతభవనాలు ఉన్నా యి. మిగిలిన చోట్ల నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలోని ఉండవల్లి, వావిలాల, యాపదిన్నె, మద్దెలబండ గ్రామాల్లో మాత్రమే భవన నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇటీవలే వాటిని ప్రారంభించినట్లు అధికారులు చెప్తున్నారు. మిగిలిన చోట్ల ప్రైవేటు భవనాల్లో ఈ దవాఖానాలు కొనసాగుతున్నాయి.

మెరుగైన వైద్య సేవలు

పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తున్నాం. దవాఖానాలకు సొంత భవనాల నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు యత్నిస్తున్నాం. పల్లె దవాఖానాల్లో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- డాక్టర్‌ సిద్దప్ప, డిప్యూటీ డీఎంహెచ్‌వో

Updated Date - 2022-11-30T23:52:44+05:30 IST