సాదాసీదాగా మండల సమావేశం

ABN , First Publish Date - 2022-01-29T04:51:09+05:30 IST

పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండల సమావేశం సాదాసీదాగా ముగిసింది.

సాదాసీదాగా మండల సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ వనజ

మక్తల్‌, జనవరి 28 : పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండల సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎంపీపీ వనజ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. కాచ్‌వార్‌ ఎంపీటీసీ సభ్యుడు బలరాంరెడ్డి మాట్లాడుతూ ఎంపీపీ కార్యాలయ ఆవరణలో సహకార బ్యాంకుకు 400 గజాల స్థలం కేటాయిస్తే సుమారు 1000 గజాల వరకు ఆక్రమించుకున్నారని వెంటనే నోటీసులు పంపించాలన్నారు. అలాగే భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి సత్యవార్‌ చెరువుకు వెళ్లే కాల్వలకు షెట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథాగా పోతుందని, ఈ విషయంపై దృష్టి పెట్టాలని భూత్పూర్‌ సర్పంచు హన్మంతు కోరారు. అలాగే తొమ్మిది రైతు వేదికల పనులు కొనసాగుతున్నాయని ప్రస్తుతం కర్ని, సత్యవార్‌, రుద్రసముద్రం రైతువేదిక పనులు పూర్తి అవుతున్నాయని మిషన్‌ భగీరథ అధికారి వినోద్‌ తెలిపారు. ఏవో మితున్‌ చక్రవర్తి మాట్లాడుతూ మండలంలో 20260 మంది రైతులకు రూ.32 కోట్ల రైతుబంధు, 39 మంది రైతులకు 1.90 కోట్ల రైతు బీమా అందించామన్నారు. పశు సంవర్ధకశాఖ అఽధికారి వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గొర్రెలు, నాటుకోళ్లు, పందుల పెంపకానికి 50శాతం సబ్సిడీ ఉందని ఇందుకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంఈవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండలంలో ఉపాధ్యాయుల బదిలీల వల్ల 94 మంది బదిలీపై వెళ్లారని 86 మంది జాయిన్‌ అయ్యారని ఒకరు ఇంకా చేరలేదని తెలపగా కర్ని ఎంపీటీసీ సభ్యుడు రంగప్ప మాట్లాడుతూ కర్ని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది పనిచేస్తుండగా ప్రస్తుతం 8 మంది మాత్రమే వచ్చారన్నారు. ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఎంఈవోకు వివరించారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో పంచాయతీరాజ్‌ అథితి గృహం వినియోగంలో లేకపోవడంతో శిథిలావస్థకు చేరు తోందని ఎంపీటీసీలు పేర్కొన్నారు. వైద్యుడు సిద్ద ప్ప మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారికి వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యిందన్నారు. గుడి గండ్లలో పాత స్తంభాలు తొలగించి కొత్త విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీ ఏఈ సత్యంకు వివరించగా స్తంభాలను ఆన్‌లైన్‌లో బుక్‌చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 

Read more