మహిళలు, బాలికలకు షీటీం భరోసా

ABN , First Publish Date - 2022-11-30T23:55:34+05:30 IST

మహిళలకు, యువతులు, బాలికలకు షీటీం భరోసా కల్పిస్తోందని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. ఎవరైనా అకతాయిలు ఇబ్బందులు కల్గిస్తే వెంటనే షీటీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మహిళలు, బాలికలకు షీటీం భరోసా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఎనిమిది క్రిమినల్‌ కేసులు, 30 పెట్టి కేసులు

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, నవంబరు 30 : మహిళలకు, యువతులు, బాలికలకు షీటీం భరోసా కల్పిస్తోందని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. ఎవరైనా అకతాయిలు ఇబ్బందులు కల్గిస్తే వెంటనే షీటీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎనిమిది క్రిమినల్‌ కేసులతో పాటు, 30 ఈ-పెట్టి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రద్దీగా ఉన్న ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలలు, పబ్లిక్‌ ప్రదేశాలలో 90 హాట్‌స్పాట్‌లను షీటీం సభ్యులు గుర్తించి, ఇప్పటివరకు వాటిని 644 సార్లు పరిశీలించారని చెప్పారు. ఈ హాట్‌స్పాట్లలో మహిళలను వేధిస్తున్న 30 మంది ఆకతాయిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరో 42 మంది అకతాయిలకు గద్వాల డీఎస్పీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్న ఎనిమిది మందిని రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. వేధింపులు, దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 78 మంది మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. షీటీం సేవలపై 26 పాఠశాలలు, 29 కళాశాలలు, 42 పబ్లిక్‌ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. వేధింపులు ఎదురైతే షీటీం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్‌ 7993131391, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 9494921100లకు లేదా డయల్‌ 100కు కూడా కాల్‌ చేయొచ్చని చెప్పారు. డీఎస్పీ రంగస్వామి నేతృత్వంలో, మహిళా ఎస్‌ఐ రజిత ఆధ్వర్యంలో షీటీం పని చేస్తోందని తెలిపారు. సమావేశంలో షీటీం సభ్యులు శేషన్న, రామిరెడ్డి, హనుమంతు, దివ్యవాణి, లోకేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:55:34+05:30 IST

Read more