నవదుర్గా నమోస్తుతే

ABN , First Publish Date - 2022-09-27T05:16:16+05:30 IST

నవదుర్గా నమోస్తుతే.. జగదాంబికా పాహిమాం.. రక్షమాం.. అని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

నవదుర్గా నమోస్తుతే
జములమ్మ ఆలయంలో పార్వతీదేవిగా జములమ్మ అమ్మవారు; ఉండవల్లిలోని అనసూయమ్మ కాలనీలో కొలువుదీరిన దుర్గమ్మ; అయిజలోని అంబాభవానీ ఆలయంలో మహాగౌరి అలంకరణలో అమ్మవారు; వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో దుర్గమ్మకు పూజలు చేస్తున్న భక్తులు

- జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

- వివిధ రూపాల్లో అమ్మవార్లకు అలంకరణ

- భక్తుల ప్రత్యేక పూజలు

నవదుర్గా నమోస్తుతే.. జగదాంబికా పాహిమాం.. రక్షమాం.. అని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో సోమవారం శరన్నవ రాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చనలు చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. 


గద్వాల టౌన్‌, సెప్టెంబరు 26 : గద్వాల పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం వద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆలూరు బిలకంటి రాము, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి పాల్వయి సురేష్‌ తదితరులు కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. 19 వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహానికి మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కృష్ణవేణి రామాంజనేయులు పూజలు చేశారు. తొలిరోజు అమ్మ వారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు. 


పార్వతీదేవిగా జములమ్మ దర్శనం

గద్వాల : జమ్మిచేడ్‌ జములమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు పార్వతీదేవిగా భక్తు లకు దర్శనం ఇచ్చారు. మొదట రిజర్వాయర్‌ వద్ద గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం గంగాజలం తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని పార్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి పూజను ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌, ఈవో కవిత, బెంగళూరుకు చెందిన విగ్రహ దాతలు పాల్గొన్నారు. ఆనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. 


ఉండవల్లి : మండల కేంద్రంలోని అనసూయమ్మ కాలనీలో ఉన్న దుర్గమ్మ, అయ్యప్పస్వామి ఆలయంలో సరస్వతి దేవి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  బైరాపురంలోని నిత్య భావన ఆశ్రమంలో రాజరాజేశ్వరీ అమ్మవారు గాయత్రీ దేవిగా పూజలందుకున్నారు. ఆలయాల్లో గోపూజ, గణపతి, మృతుంజయ హోమాలు నిర్వహించారు. 


అయిజ : పట్టణంలోని అంబాభవానీ, కన్యకాపరమేశ్వరి, కాళికామాత ఆలయాల్లో సోమవారం శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంబా భవానీ ఆలయంలో అమ్మవారు మహాగౌరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భక్తుల పూజలందుకున్నారు. కాళికమాత బాల త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు. 


వడ్డేపల్లి : మునిసిపాలిటీ పరిధిలోని పైపాడులో సోమవారం శరన్నవారత్రి ఉత్నవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వాల్మీకి గుడి వద్ద కొలువుదీరిన దుర్గమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


రాజోలి : మండల కేంద్రంలోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు మహాగాయత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆజాద్‌నగర్‌ కాలనీ, కోట వీధి, కొట్టాలవీధులలో అమ్మవారి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.


ఇటిక్యాల : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లిలోని సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారు సోమవారం ఆదిలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అంజనేయస్వామి అలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారు బాలా త్రిపుర సందరీదేవిగా పూజలు అందుకున్నారు. మండలంలోని మునుగాలలోని జమ్ములమ్మ అలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరిరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సర్పంచు జయలక్ష్మి, లక్ష్మీ నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మండలంలోని శేక్‌పల్లిలో బతుకమ్మ అడారు. 

Read more