జడ్చర్ల కాంగ్రెస్‌లో టికెట్ల రగడ

ABN , First Publish Date - 2022-07-19T05:09:47+05:30 IST

జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుధ్‌రెడ్డికే కాంగ్రెస్‌ టికెట్టంటూ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంగా మారాయి.

జడ్చర్ల కాంగ్రెస్‌లో టికెట్ల రగడ

అనిరుధ్‌కు మద్దతుగా కోమటిరెడ్డి బహిరంగ ప్రకటన

టికెట్‌ ఎప్పుడో ఖరారైందని వెల్లడి

రాజకీయంగా కలకలం రేపిన ఆయన వ్యాఖ్యలు

పార్టీలోకి కొత్తగా వచ్చేవారికి టికెట్లివ్వబోమని స్టేట్‌మెంట్‌

మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ చేరికతో ఉధృతమైన వర్గపోరు

అధిష్ఠానం స్పందనపైనే అందరి చూపు


జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుధ్‌రెడ్డికే కాంగ్రెస్‌ టికెట్టంటూ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా   చర్చనీయాంగా మారాయి. అనిరుధ్‌రెడ్డి తన ప్రచారం నిమిత్తం కొన్న ఐదు వాహనాలను ఆదివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నివాసం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్‌(ఎర్ర శేఖర్‌) ఇటీవల బీజేపీని వీడి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం, ఆయన చేరికను దాదాపు ఆరు నెలల పాటు కోమటిరెడ్డి అడ్డుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


జడ్చర్ల కాంగ్రెస్‌ టికెట్‌ అనిరుధ్‌రెడ్డికేనంటూ ఆ పార్టీ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో ఇప్పటివరకు కొనసాగిన సంప్రదాయాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్స్‌ వచ్చే వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. అలాంటిది రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్లు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకేనని పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నా, ఈ వ్యాఖ్యలు వర్గ పోరును సూచిస్తున్నాయనే విశ్లేషణ వస్తోంది. నియోజకవర్గంలో ఇప్పటికే డాక్టర్‌ మల్లురవి, అనిరుధ్‌రెడ్డి వర్గాలుగా పార్టీలో కార్యకర్తలు పని చేస్తుండగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్‌(ఎర్ర శేఖర్‌) పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దాంతో అప్పటి నుంచి టికెట్‌ పంచాయతీ మొదలైంది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక ఎర్ర శేఖర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. బలమైన బీసీ సామాజికవర్గం, టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్‌ రికార్డు ఆయనకుంది. దాంతో పాటు బీజేపీలోనూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని వదులుకొని వచ్చిన నేపథ్యంలో ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందనే భావనతో రేవంత్‌ ఆయన చేరిక కోసం పట్టుబట్టారు. 


గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపాటు

కాంగ్రెస్‌లో 2016 నుంచి క్రియాశీలకంగా ఉన్న అనిరుధ్‌రెడ్డి గత ఎన్నికల్లోనూ టికెట్‌ ఆశించి, భంగపడ్డారు. అయినా ఆ ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్‌ మల్లురవికి మద్దతుగా నిలవడం, ఆ తర్వాత ఎంపీ,  స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పని చేశారు. మల్లురవి నాగర్‌కర్నూల్‌ ఎంపీగా వెళతారనే ప్రచారంతో ఈసారి టికెట్‌ తనదే ననే విశ్వాసంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎర్రశేఖర్‌ పార్టీలో చేరతారనే సమాచారంతో అనిరుధ్‌రెడ్డిని తన వర్గంగా భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శేఖర్‌ చేరికను నాలుగుసార్లు వాయిదా వేయించగలిగారు. కానీ రేవంత్‌ ఢిల్లీలో చక్రం తిప్పి, ఎట్టకేలకు శేఖర్‌ను పార్టీలోకి తెచ్చారు. ఈ పరిణామాలతో తాజాగా నియోజకవర్గంలో టికెట్‌ పంచాయతీ మొదలైంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్‌కు చేదోడుగా ఉంటోన్న మల్లురవి ఎక్కడా తన పోటీ అంశాన్ని ప్రస్తావించకపోగా, శేఖర్‌ చేరిక సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి నిర్వహించడంతో శేఖర్‌కే జడ్చర్ల టికెట్‌ అనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే అనిరుధ్‌రెడ్డికే టికెట్‌అని, ఆయనే ఇక్కడ సమర్థవంతమైన అభ్యర్థంటూ కోమటిరెడ్డి కితాబిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు టికెట్‌ బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. త్వరలో బహిరంగసభ నిర్వహిస్తామంటూ ప్రకటించడం పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనవర్గీయునికి టిక్కెటిప్పిచ్చే బాధ్యత తనదేనని బహిరంగంగా ప్రకటించడం పార్టీలో వర్గపోరుని బహిర్గతం చేసినట్లయ్యిందని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు పేర్కొన్నారు. 


వేచి చూడాలంటున్న సీనియర్లు

పాలమూరు ఉమ్మడి జిల్లాలో జడ్చర్లనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ ఇద్దరు, ముగ్గురు చొప్పున కాంగ్రెస్‌ తరఫున టికెట్లు ఆశిస్తున్నారని, ఇదే రీతిలో అక్కడ కూడా టిక్కెట్ల కోసం  బల ప్రదర్శనలు, తమ అనుచరుల కోసం బహిరంగ ప్రకటనలు చేస్తే పరిస్థితి ఏంటనే చర్చ పార్టీ క్యాడర్‌లో మొదలైంది. ఈ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని, అధిష్ఠానం స్పందనతోనే స్పష్ఠత వస్తుందని సీనియర్‌ నాయకులు అంటున్నారు. అప్పటివరకు ఎవరూ దుందుడుకు చర్యలకు పాల్పడకపోతేనే మంచిదనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏమన్నారంటే..

‘‘అనిరుధ్‌రెడ్డికి టికెట్‌ ఎప్పుడో నిర్ణయమైపోయింది. కొత్తగా.. ఆయనొచ్చిండని, ఈయ నొచ్చిండని మీరెవరూ భయపడవద్దు. కొత్తగా వచ్చినంత మాత్రాన టికెట్లివ్వాలని లేదు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లలో అలా ఇస్తారు. కానీ, కాంగ్రెస్‌లో ఇవ్వరు. ఆయనకు ఇంట్రస్ట్‌ ఉంటే కొంతకాలం పార్టీలో పనిచేస్తే వేరే నియోజకవర్గంలో ఎక్కడన్నా ఇద్దామని వారే చెప్పారు. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అనిరుధ్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాం. ఈయన పాత క్యాండెట్‌ కాబట్టి, ఈయన అయితేనే బాగుంటుందని టికెట్‌ ఇద్దామనే నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాం. మాణిక్‌ఠాగూర్‌ మా ఇంటికి వచ్చినప్పుడు, నేను, రేవంత్‌రెడ్డి ఢిల్లీలో, అమెరికాలో కలిసిన ప్పుడు కూడా మాట్లాడుకున్నాం. అనిరుధ్‌ టికెట్‌కు ఎలాంటి ఢోకాలేదు. కష్టకాలంలో ఈయన పార్టీ కోసం పని చేశాడు. గత ఎన్నికల్లో టికెట్‌ రాకపోయినా మల్లు రవి కోసం పని చేశాడు. ఆ తర్వాత ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారంతో పాటు అంతోఇంతో ఆర్థికంగా సాయం చేశాడు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఎప్పుడూ అన్యాయం జరగదు. నేనున్నా కాబట్టి మీకెలాంటి ఆందోళన అవసరం లేదు. నాతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మధుయాష్కీ అందరం అనిరుధ్‌కు మద్ధతుగా ఉన్నాం. త్వరలో జడ్చర్లలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. పీసీసీ అధ్యక్షులతో పాటు సీనియర్లందరూ ఈ సభకు వస్తారు.’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనిరుధ్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

Updated Date - 2022-07-19T05:09:47+05:30 IST