రక్తమోడుతున్న రహదారులు

ABN , First Publish Date - 2022-06-08T05:09:23+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

రక్తమోడుతున్న రహదారులు
అనంతపురం స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బైక్‌ (ఫైల్‌), ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న ఆటో (ఫైల్‌)

- జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

- ఐదు నెలల్లో 74 మంది మృత్యువాత

- 35 మందికి గాయాలు

- అతివేగం, అజాగ్రత్త ప్రధాన కారణాలు

గద్వాల క్రైం, జూన్‌ 7 : జోగుళాంబ గద్వాల జిల్లాలో తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.  జిల్లా పరిధిలోని జాతీయ రహదారితో పాటు, ఇతర రోడ్లపైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన ఐదు నెలల్లోనే వివిధ ప్రమాదాల్లో 74 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. గత నెలలో ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


ఇటీవల జరిగిన సంఘటనలు

- ఈ నెల ఆరున గద్వాలకు చెందిన హుసేన్‌, భార్య పర్వీన్‌(35) కుమారుడు అఫ్రిదిలు ద్విచక్ర వాహనంపై కర్నూల్‌ నుంచి గద్వాలకు వస్తున్నారు. ఇటిక్యాల మండలం కోదండాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వేముల స్టేజీ సమీపంలో వాహనం అదుపుతప్పి కింద పడింది. హుస్సేన్‌, అఫ్రిది గాయపడగా, పర్వీన్‌ చికిత్ప పొందుతూ మృతి చెందింది.


- జూన్‌ 5న ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ సమీపంలో ఓవర్‌టేక్‌ చేయబోతున్న కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. డ్రైవర్‌ ప్రేమ్‌రాజ్‌ మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.


- జూన్‌ 1న పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ప్రాగటూరుకు చెందిన చిన్న ఉస్సేన్‌ (50) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు.


- మే 19న ఇటిక్యాల మండలం మునుగాలకు చెందిన ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్సరం చివరి పరీక్ష పూర్తి చేసుకొని రాజేశ్వరి(18), ఆమె తండ్రి నల్లన్న(42) బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా గద్వాల మండలం అనంతపురం స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.


- మల్దకల్‌ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన కోతి గోవిందు కుమారుడు అంజి(25) సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా, గద్వాల పట్టణంలోని సంగాల చెరువుకు ఎదురుగా ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. వీరితో పాటు పలువురు రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు.


నిర్లక్ష్యమే అసలు కారణం

డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో పాటు అతివేగం, అజాగ్రత్త, మద్యం తాగి వాహనం నడపడం కూడా కారణాలని పోలీసులు చెప్తున్నారు. కొందరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. వేగంగా డ్రైవింగ్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించక మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు ప్రధాన చౌరస్తాలో బ్లింకర్లు ఏర్పాటు చేయక పోవడం కూడా ప్రమాదాలకు కారణమని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదాల నివారణకు హైవే అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, డ్రైవింగ్‌ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం

వాహనదారులు అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణం. జిల్లాకేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలలో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతీ రోజు దాదాపు 20 కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ ఒక్కరూ వాహనాలను నియమిత వేగంతో నడపాలి. ట్రాఫిక్‌ నియమాలు పాటించాలి. అతివేగం అనర్థాలకు మూలమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

- రంగస్వామి, డీఎస్పీ, గద్వాల

Updated Date - 2022-06-08T05:09:23+05:30 IST