సాగునీటి కాలువలపై మోటార్లను తొలగించాలి

ABN , First Publish Date - 2022-10-15T04:40:30+05:30 IST

సాగునీటి కాలువలపై మోటార్లు బిగించకుండా చర్యలు తీసుకోవాలని, ఉన్న వాటిని తొలగించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

సాగునీటి కాలువలపై మోటార్లను తొలగించాలి
చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ వద్ద నిర్వాసితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- గట్టు, మల్దకల్‌ మండలాల్లో పర్యటన

- చిన్నోనిపల్లి రిజర్వాయర్‌, పునరావాస కేంద్రాల పరిశీలన

గట్టు/మల్దకల్‌, అక్టోబరు 14 : సాగునీటి కాలువలపై మోటార్లు బిగించకుండా చర్యలు తీసుకోవాలని, ఉన్న వాటిని తొలగించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాలువలపై మోటార్లు బిగించుకోవడం వల్ల నీరు లీకవడంతో పాటు, మట్టి కరిగి కాలువలు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. గట్టు మండలంలోని ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి రిజర్వా యర్లు, చిన్నోనిపల్లి పునరావాస కేంద్రాన్ని, మల్దకల్‌ మండలంలో 105వ ప్యాకేజీ కింద నిర్మించిన కాలువలు, తాటికుంట రిజర్వాయర్‌ కాలువలను శుక్ర వారం ఆమె పరిశీలించారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆమె, అక్కడ దీక్ష నిర్వహిస్తున్న నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చిన్నోనిపల్లి పునరావాస కేంద్రంలో తాగునీరు, రోడ్లు, వాటర్‌ట్యాంకులు, విద్యుత్‌ సౌకర్యం తదితర పనులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌ కాలువలను పరిశీలించి, దానిపై ఏర్పాటు చేసుకున్న మోటార్లను వెంటనే తొలగించాలని అధికారులకు అదే శించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావ్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ భాస్కర్‌, ఈఈ రహీమొద్దీన్‌, సర్పంచ్‌ ఉమా దేవేందర్‌, తదిత రులు పాల్గొన్నారు.


గోడు వినిపించుకున్న నిర్వాసితులు

  చిన్నోనిపల్లి నిర్వాసితులు కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి తమ గోడును వినిపించుకున్నారు. శుక్రవారం రిజర్వాయర్‌ను పరిశీలించిన అనం తరం ఆమె అక్కడ దీక్ష చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల నిర్వాసితులు తమ సమస్యను కలెక్టర్‌కు వివరించారు. 260 రోజులుగా తాము ధర్నా చేస్తున్నప్పటికి ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయకట్టు లేని రిజర్వాయర్‌ను రద్దు చేయాలని కోరారు. రిజర్వాయర్‌ నిర్మాణంతో ఐదు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతారని కలెక్టర్‌కు వివరించారు. రిజర్వాయర్‌ రద్దు చేసే వరకు పోరాటం అపేది లేదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. 


నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలి

గద్వాల క్రైం : రేషన్‌ షాపు డీలర్లు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్స వం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 1,60,107 రేషన్‌ కార్డులు ఉన్నాయని, 54,858 మంది లబ్ధిదారులకు ప్రతీ నెల బియ్యం సరఫరా అవుతున్నాయన్నారు. చౌకఽధరల దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తే వాటిని తిప్పి పంపించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు బలవర్ధకమైన బియ్యాన్ని తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో పిల్లలకు, గర్భిణులకు న్యూట్రిషన్‌ ఫుడ్‌ అందేలా సర్పంచులు, గ్రామ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. భోజనం నాణ్యతను చెక్‌ చేసేందుకు ఒక టీచర్‌ పిల్లలతో పాటు భోజనం చేయాలన్నారు. రక్తహీనత, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో సిరాజుద్దీన్‌, డీఎం ప్రసాద్‌రావు, డీడబ్ల్యూవో ముషాహిదా బేగం పాల్గొన్నారు.

Read more