రామస్వామి జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2022-04-25T04:48:22+05:30 IST

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన కమ్యునిస్టు ఉద్యమకారుడు కందికొండ రామస్వామి అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు.

రామస్వామి  జీవితం ఆదర్శం
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

ప్రజా కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న



నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 24: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన కమ్యునిస్టు ఉద్యమకారుడు కందికొండ రామస్వామి అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆయన జీవితం ఆదర్శమని చెప్పారు. జిల్లా కేంద్రంలోని దేవకీ ఫంక్షన్‌హాలులో నెలపొడుపు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో కందికొండ రామస్వామి స్మారక పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రముఖ కవి గాజోజు నాగభూషణం రచించిన ‘ప్రాణదీపం’ కవితా సంపుటికి కందికొండ రామస్వామి 2021 పురస్కారం అందించారు. సంస్థ కార్యదర్శి పి.వహీద్‌ఖాన్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోరటి వెంకన్నతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ, పీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వర్ధం పర్వతాలు, ఎం.బాల్‌నర్సింహ  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగ భూషణంకు పురస్కారం అందించి, సత్కరించారు. అనంతరం గోరటి వెంకన్న మాట్లాడుతూ కందికొండ రామస్వామి కమ్యునిస్టుగా కందనూలు ప్రాంత బడుగు, బలహీన వర్గాల సమస్యలపై అలుపెరుగని పోరాటాలను చేశారన్నారు. ఆయనతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కవి వెంకట్‌పవార్‌ ప్రాణదీపం కవితా సంపుటిని సమీక్షించారు. కార్యక్రమంలో నెలపొడుపు సాహిత్య వేదిక గౌరవ అధ్యక్షుడు కందికొండ మోహన్‌, అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత, సీనియర్‌ నాయకులు అబ్దుల్లాఖాన్‌, బోనాసి రాములు, జెట్టి ధర్మరాజు, సభ్యులు దినకర్‌, బాలీశ్వర్‌, శివశంకరాచార్యులు, పెబ్బేటి మల్లికార్జున్‌, ఎదిరేపల్లి కాశన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-25T04:48:22+05:30 IST