నిజాం పాలనలో అణచివేత

ABN , First Publish Date - 2022-09-17T05:41:21+05:30 IST

నిజాం పాలనలో అణచివేయబడ్డామని, రజాకార్ల చేతిలో అనేక మంది అశువులు బాసారని, ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు ఎదురు తిరిగి పోరాటం చేశారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

నిజాం పాలనలో అణచివేత
జాతీయ సమైక్యతా ర్యాలీని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎదురు తిరిగి పోరాడిన ప్రజలు

- పోరాట యోధులను స్మరించుకుందాం 

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- ప్రారంభమైన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

గద్వాల, సెప్టెంబరు 16 : నిజాం పాలనలో అణచివేయబడ్డామని, రజాకార్ల చేతిలో అనేక మంది అశువులు బాసారని, ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు ఎదురు తిరిగి పోరాటం చేశారని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్‌ నుంచి వ్వవసాయ మార్కెట్‌ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించలేదని అన్నారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనికచర్యకతో తెలంగాణకు విముక్తి లభించిందని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధులను స్మరించుకుందామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అంతకు ముందు మండల ప్రజా ప్రతినిధులు ఒక్కో రంగంలో తెలంగాణ అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, అడిషినల్‌ ఎస్సీ రాములు నాయక్‌, వినియోగదారుల ఫోరమ్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, ఎంపీపీలు ప్రతాప్‌ గౌడ్‌, విజయ్‌, రాజారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సుబాన్‌ పాల్గొన్నారు.


ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాజీవ్‌శర్మ

గద్వాల క్రైం : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్‌ మైదానంలో శనివారం నిర్వహించనున్న పతాకావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ హాజరౌతున్నట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8.55 నుంచి 9.00 గంటల వరకు ముఖ్య అతిథి ఆగమనం, 9.00 నుంచి 9.02 వరకు పతాకావిష్కరణ, 9.02 నుంచి 9.15 వరకు వందన స్వీకారం, 9.15 నుంచి 9.30 వరకు ముఖ్యఅతిథి సందేశం, 9.30 నుంచి 9.45 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. Read more