పోస్టులు అమ్ముకున్నరు

ABN , First Publish Date - 2022-07-06T05:03:07+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోస్టులు అమ్ముకున్నరు
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి

గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు

ఒక్కో పోస్టు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు విక్రయం

తమ వారికి ఇప్పించుకున్న దవాఖాన సిబ్బంది

నకిలీ సర్టిఫికెట్లు ఉన్నా పట్టించుకోని అధికారులు

అవినీతి బాగోతంలో ఆస్పత్రికి చెందిన ముగ్గురి హస్తం?


జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు తీసుకొని, అనర్హులకు ఉద్యోగాలిచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు సూచించిన వారికి కాకుండా ఆస్పత్రిలో పని చేస్తున్న సిబ్బంది డబ్బులు ఇచ్చి, తమ బంధువులకు జాబ్‌లు ఇప్పించుకున్నారని తెలుస్తోంది.

- గద్వాల క్రైం


జోగుళాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను డబ్బులు తీసుకుని ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు నెలల కిందట స్టాఫ్‌నర్స్‌, వెంటిలేటర్‌ టెక్నీషియన్‌, బ్లడ్‌బ్యాంక్‌ మెడికల్‌ అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డ్రైవర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పటినుంచి ఆస్పత్రిలో పనిచేసే వారు తమవారికి ఎలాగైన ఉద్యోగాలు ఇప్పించాలని దవాఖానాలోని ప్రధాన వ్యక్తితో పాటు మరో ఇద్దరితో ఒప్పందం చేసుకున్నారని సమాచారం. ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి జాబ్‌లు ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఉన్న తొమ్మిది పోస్టులకు 450 మంది దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది.


నకిలీ ధ్రువపత్రాలు ఉన్నా డోంట్‌ కేర్‌..

ఆస్పత్రిలో ఉద్యోగం సాధించిన ఓ మహిళతో పాటు మరికొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినా, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఒకరు ఫేక్‌ ధ్రువపత్రాలు జత పరిచి అతనికి చెందిన వారికి ఉద్యోగం ఇప్పించినట్లు ఆసుపత్రిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెరిట్‌ లిస్ట్‌లో పేర్లు ఉంచిన కొద్ది సేపటికే మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ఉద్యోగి దానిని వెంటనే నోటిస్‌ బోర్డుపై నుంచి తొలగించి, తమ డెస్క్‌లో ఉంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా జిల్లా అధికారులకు తెలియదా? లేక వారికి కూడా మామూళ్లు ముట్టాయా? అన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా అర్హులకు కాకుండా ఆస్పత్రిలో పని చేసే వారి బంధువులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


ముగ్గురి హస్తం

ఆస్పత్రిలోని ఓ ప్రధాన పోస్టులో ఉన్న ఉద్యోగితో పాటు మరో ఇద్దరు కింది స్థాయి ఉద్యోగుల కనుసన్నల్లో నకిలీ ధ్రువపత్రాలు ఉన్న వారు దర్జాగా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. అందుకు గాను వారు ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వరకు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఎవరెవరికి ఎంత ముట్టిందో ఆ అధికారులకే తెలియాలి. విషయం జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులకు తెలిసిందని, ఈ బాగోతంపై త్వరలో చర్యలు తీసుకోకున్నారని సమాచారం.


మా దృష్టికి రాలేదు

నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు పొందినట్లు మా దృష్టికి రాలేదు. ల్యాబ్‌ అటెండర్‌ పోస్టును కలెక్టర్‌ ఆదేశాలతో ఆపాము. నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌, గద్వాల

Read more