పాతాళ గంగ పైపైకి..

ABN , First Publish Date - 2022-09-14T04:41:58+05:30 IST

సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో వనపర్తి జిల్లాలో నీటి లభ్యత వనరులు పెరిగాయి. దాంతో గడిచిన ఐదేళ్లుగా భూగర్భ జలాల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. ఈ సంవత్సరం ఆగస్టు పూర్తయ్యే నాటికి భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే వనపర్తి జిల్లా మొదటి స్థానంలో ఉంది.

పాతాళ గంగ పైపైకి..
వనపర్తి మండలం చిట్యాల నుంచి పెద్దమందడి వెళ్లే దారిలో నిండుకుండలా మారిన బావి

భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే వనపర్తికి మొదటి స్థానం

కమాలొద్దిన్‌పూర్‌లో 0.25 మీటర్లలోనే జలాలు

3.22 మీటర్ల లోతులోనే జిల్లా సగటు భూగర్భ జలాలు

కొత్తకోటలోని కానాయపల్లి మినహా అన్నిచోట్లా 10 మీటర్లకు పైనే


సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో వనపర్తి జిల్లాలో నీటి లభ్యత వనరులు పెరిగాయి. దాంతో గడిచిన ఐదేళ్లుగా భూగర్భ జలాల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. ఈ సంవత్సరం ఆగస్టు పూర్తయ్యే నాటికి భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే వనపర్తి జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో సగటున 3.22 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండటం, కొత్తకోట మండలం కానాయపల్లి మినహా మిగతా అన్నిచోట్ల 10 మీటర్ల ఎగువనే నీళ్లు ఉండటంతో ఈ ఘనత దక్కింది. ఈ నేపథ్యంలో సాగునీటి కాలువలు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటల ద్వారా జిల్లాలో మెజారిటీ ఆయకట్టు సాగవుతోంది.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


వనపర్తి జిల్లాలో భూగర్భ జలాల లభ్యత పెరిగింది. జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలం కమాలొద్దిన్‌పూర్‌ అత్యంత మీద భూగర్భ జలాలు ఉన్న ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ కేవలం 0.25 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. సాగునీటి వనరులు ఏర్పాటు చేయక ముందు ఈ మండలం తీవ్ర కరువు పీడిత మండలంగా ఉండేది. జిల్లాలో ఒకప్పుడు మెజారిటీ వలసలు ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల నుంచే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ రెండు మండలాల పరిధిలో మిగతా అన్ని మండలాల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పెరగడం విశేషం. కమాలొద్దీన్‌పూర్‌ తర్వాత భూగర్భ జలాలు అత్యంత సమీపంలో ఉన్నది అమరచింత మండలంలోని సింగం పేటలో. ఆ తర్వాత స్థానంలో పెద్దమందడి మండల కేంద్రం ఉంది. ఈ రెండు మం డలాలకు సంబంధించి సాగునీటి వనరులు పెరగడానికి ఖిల్లాఘ ణపురం బ్రాంచ్‌ కెనాల్‌, పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ కెనాళ్ల ద్వారా మెజారిటీ చెరువుల ను నింపి, బోర్లను, బావులను రీచార్జ్‌ చేస్తుండటంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. మిగతా అ న్ని మండలాల్లో కూడా పెరుగుదల అధికంగానే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్లుగా వర్షాలు కూడా సమృద్ధిగా కుర వడం ఈ పెరుగుదలకు మరో కారణంగా చెప్పొచ్చు.


ఎక్కడెక్కడ ఎంతెంత..

భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో 13 ప్రాంతాల్లో ఫీజో మీటర్లు, ఆటోమేటిక్‌ వాటర్‌ లెవల్‌ రికార్డు సిస్టమ్‌ మీటర్లు ఉన్నాయి. అమరచింత మండలం సింగపేట వద్ద ఫీజో మీటర్‌ ఉంది. ఇక్కడ వాటర్‌ లెవల్‌ కేవలం అరమీటర్‌ లోతులోనే ఉంది. ఆ తర్వాత ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న ఏడబ్ల్యూఎల్‌ఆర్‌ వద్ద 5.80 మీటర్ల లోతులో జలాల ఉన్నాయి. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో 2.60 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, అదే మండలం కమాలొద్దిన్‌పూర్‌లో పావు మీటర్‌ లోతులో ఉన్నాయి. గోపాల్‌పేట మండలం ఏదుట్లలో ఉన్న ఫీజోమీటర్‌ వద్ద 3.35 మీటర్ల లోతులో, అదే మండల కేంద్రంలోని ఏడబ్ల్యూఎల్‌ఆర్‌ వద్ద 1.90 మీటర్ల లోతులో, కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద ఉన్న ఫీజో మీటర్‌ లెక్కల ప్రకారం 10.75 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో అత్యంత ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నవి కానాయపల్లిలోనే. మదనాపూర్‌ మండలంలోని మార్కెట్‌ యార్డు వద్ద 4.10 మీటర్ల లోతులో, పాగనల్‌ మండలం జడ్పీహెచ్‌ స్కూల్‌ వద్ద ఉన్న ఫీజ్‌ మీటర్‌లో 5.60, పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి వద్ద 1.90, పెద్దమందడి మండల కేంద్రంలో 0.85, వనపర్తి మండలం పెద్దగూడెం వద్ద 1.80, వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి వద్ద 2.50 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో సగటున కేవలం 3.22 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తున్నాయి.


ఎత్తిపోతలు, చెరువులే కారణం..

జిల్లాలో గడిచిన ఐదేళ్లుగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నా, అది భూగర్భ జలాలపై ప్రభావం చూపేంతగా లేదు. కానీ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులుగా ఉన్న జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా ఫేజ్‌ -2 ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఘనత సాధ్యమైందని చెప్పొచ్చు. జూరాల ఎడమ కాలువ వెంట ఫీడర్‌ ఛానళ్ల ద్వారానే నీరు అందుతోంది. దాంతో కాలువకు సమీపంలో ఉన్న చెరువులన్నీ నింపుతున్నారు. జూరాల ఎడమ కాలువ కింద 2021-22 సంవత్సరంలో 154 చెరువులను నింపారు. అలాగే రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద 121 చెరువులను, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా 161 చెరువులను నింపారు. మొత్తంగా జిల్లాలో 436 చెరువులను నింపారు. ఈ చెరువులను నింపడానికి గొలుసుకట్టు విధానంలో వాగులు, వంకల్లోకి నీటిని వదలడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. చెరువుల్లో ఏడాది పొడవున నీరు ఉండటం వల్ల కూడా కింద ఉన్న బోర్లు, బావులు రీచార్జ్‌ అవుతున్నాయి. జిల్లాలో కేవలం సాగునీటి కాలువల ద్వారా 1.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందతుండగా, భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లు, బావుల ద్వారా మరో 50 వేల ఎకరాల వరకు నీరందుతోంది. ప్రస్తుతం పేరూరు, కర్నె తండా ఎత్తిపోతల పథకాలు పురోగతిలో ఉన్నాయి. పలు సాగునీటి కాలువల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అవి కూడా పూర్తయితే అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు మీటర్ల లోపే భూగర్భజలాలు లభ్యమయ్యే అవకాశం ఉంది.

Read more