తల్లిలాంటి పాలమూరు : తమిళి సై

ABN , First Publish Date - 2022-11-24T23:33:03+05:30 IST

’’పాలమూరు తెలంగాణకు తల్లిలాంటిది. ఇక్కడ విద్యార్థుల కోసం నెలకొల్పిన ఈ యూనివర్సిటీకి విచ్చేసిన మొదటి గవర్నర్‌గా నాకు అవకాశం రావడం పట్ల సంతోషిస్తున్నాను.’’

తల్లిలాంటి పాలమూరు : తమిళి సై
గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు జ్ఞాపికను అందిస్తున్న పీయూ వీసీ

మహబూబ్‌నగర్‌/పాలమూరు యూనివర్సిటీ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ’’పాలమూరు తెలంగాణకు తల్లిలాంటిది. ఇక్కడ విద్యార్థుల కోసం నెలకొల్పిన ఈ యూనివర్సిటీకి విచ్చేసిన మొదటి గవర్నర్‌గా నాకు అవకాశం రావడం పట్ల సంతోషిస్తున్నాను.’’ అని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. ఎంతో సమయం, ఎన్నో త్యాగాలు, ఎంతోశ్రమ పడితే ఈరోజు బంగారు పతకాలు సాధించారని, ఇంతటితో ఆగవద్దని, ఈ స్ఫూర్తితో ఉజ్వల భవిష్యత్‌ నిర్మించుకునేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. పాలమూరు నుంచి వచ్చిన బీజేరావు సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచారని, ఇదే జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ కూడా ఇక్కడే యూనివర్సిటీ వీసీగా పనిచేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. యూనివర్సిటీ పురోగతిని అన్నివిధాలా పూర్వవిద్యార్థులు తోడ్పాడునందించాలని, తామంతా అందుకు సహకరిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సెంట్రల్‌ యూనివర్శిటీ బీజేరావు మాట్లాడుతూ తాను ఇక్కడి మోడల్‌ బేసిక్‌ హైస్కూల్‌లో, బాలుర జూనియర్‌ కాలేజీలోనే చదివానని, 1973లో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించిన జాతీయ టాలెంట్‌టెస్టులో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు పొందానని తెలిపారు. ఉన్నతవిద్యకు నైపుణ్యాలను జోడించినప్పుడే సరైన ఫలితం వస్తుందని, కేవలం ఉద్యోగం కోసమో, అభ్యాసం కోసమో ఉన్నతవిద్య పరిమితం కాకూడదని, దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సవాళ్లను రూపుమాపే కార్యాచరణ ఉన్నతవిద్యతో రావాలన్నారు. వీసీ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ యూనివర్సిటీ పురోగతిని, చేపట్టిన కార్యాచరణను వివరించారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా అధ్యాపక బృందం పనిచేస్తోందన్నారు.

- గవర్నర్‌కు ఘనస్వాగతం :

యూనివర్సిటీకి మొదటిసారిగా విచ్చేసిన గవర్నర్‌ తమిళిసౌ సౌందర్‌రాజన్‌కు వీసీ. లక్ష్మీకాంత్‌రాథోడ్‌, అదనపు కలెక్టర్‌ సీతారామారావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజామంగతాయారు, అదనపు ఎస్పీ ఎన్‌.రాములు నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు. నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా సాయంత్రం 4.02 గంటలకు గవర్నర్‌ యూనివర్సిటీకి చేరుకున్నారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్‌ బీజేరావు, అతిథులుగా వచ్చిన జేఎన్‌టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, పీయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ భాగ్యనారాయణను పరిచయం చేసుకున్నారు. వారితో కలిసి నేరుగా వేదిక వద్దకు సరిగ్గా 4.20కి చేరుకున్నారు. జాతీయ గీతాలాపన అనంతరం అవార్డులు ప్రదానం చేశారు. గవర్నర్‌ ప్రసంగం ఆసాంతం విద్యార్థులతో అనుసంధానమై సాగడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. తిరిగి 5.17 గంటలకు గవర్నర్‌ కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కార్యక్రమంలో వీసీ ఓఎస్‌డీ మధసూదన్‌రెడ్డి, బీఎస్‌రావు, రామకృష్ణ, చెన్నప్ప, కృష్ణారావు, పరీక్షల నియంత్రాణాధికారి రాజ్‌కుమార్‌, అదనపు కంట్రోలర్‌ శాంతిప్రియ, పీయూ అధికారులు పిండి పవన్‌కుమార్‌, చంద్రకిరణ్‌, నూర్జహాన్‌బేగం, నాగం కుమారస్వామి, కిషోర్‌, కృష్ణ, జైపాల్‌రెడ్డి, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:33:03+05:30 IST

Read more