జాతి ఐక్యతను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2022-09-18T05:06:24+05:30 IST

జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ, ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌శర్మ అన్నారు.

జాతి ఐక్యతను కాపాడుకుందాం
జాతీయ జెండాను ఎగురవేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌శర్మ చిత్రంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం

- భారతదేశంలో ఇప్పుడు కన్పిస్తున్న స్వరూపం 

మునుపెన్నడూ లేదు

- సెప్టెంబరు 17ను జాతీయ 

సమైక్యతా దినంగా జరుపుకోవడం ఆనందం  

- జాతీయ పతాకావిష్కరణలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ

గద్వాల క్రైం, సెప్టెంబరు 17 : జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ, ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని  తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు డాక్టర్‌ రాజీవ్‌శర్మ అన్నారు.  శనివారం జోగుళాంబ గద్వాల పట్టణంలోని పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ఆయన పతాకావిష్కరణ చేశారు.  అనంతరం పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో 1948 సెప్టెంబరు 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని, 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, ప్రస్తుతం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. భారతదేశంలో ఈ రోజు కన్పిస్తున్న పరిపాలన స్వరూపం మునుపెన్నడూ లేదని, స్వాతంత్య్రం పొందిన సమయంలో దేశం రెండు రకాల పరిపాలన ప్రాంతాలుగా ఉండేవని, బ్రిటీష్‌ వాళ్లు ప్రత్యేకంగా పరిపాలించిన బ్రిటీష్‌ ఇండియా ఒక భాగంగా, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్ధానాలు రెండవ భాగంగా ఉండేవన్నారు. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, జవహార్‌లాల్‌ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావనల వల్ల దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్‌ వల్లబాయ్‌పటేట్‌ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైందన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయని, 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామన్నారు. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా మనం  జరుపుకుంటున్నామన్నారు.     జిల్లాలో రైతుబంధు ద్వారా వానాకాలంలో 1.60లక్షలమంది రైతుల ఖాతాలో రూ.225 కోట్ల నగదును జమ చేశామన్నారు. రైతు బీమా పథకం ద్వారా  ఇప్పటివరకు 2020 రైతు కుటుంబాలకు రూ. 111 కోట్ల 5 లక్షలు చెల్లించామన్నారు. వానాకాలంలో ఇప్పటికే సహకార శాఖ ఆధ్వర్యంలో రూ. 1 కోటి 12 లక్షల పంట రుణాలను పంపిణీ చేశామన్నారు. మత్య్చశాఖ ఆధ్వర్యంలో సబ్బిడీ చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి, వలలు, తెప్పలు, ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రాల వాహనాల కొనుగోలు కోసం ఇప్పటివరకు రూ. 11కోట్ల 75 లక్షల రూపాయలను ఖర్చు చేశామన్నారు. వానాకాలంలో జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్ట్‌, తుమ్మిళ్ల ఎత్తిపోత పఽథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిలభ్యతను బట్టి 2,27,000 ఎకరాలకు నీటిని విడుదల చేశామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, ఉచిత విద్యుత్‌, విద్య, వైద్యం, డబుల్‌బెడ్‌రూమ్‌, తదితర పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.      నేడు స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ, తక్కువ సమయంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందన్నారు.  అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత, అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష,  ఎస్సీ రంజన్‌రతన్‌కుమార్‌, డీఎస్పీ రంగస్వామి, గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-18T05:06:24+05:30 IST