కనీస సౌకర్యాలు కరువు

ABN , First Publish Date - 2022-11-02T22:58:44+05:30 IST

గద్వాల రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా మారింది. ప్రయాణికుల సంఖ్యతో పాటు సరుకుల రవాణా కూడా అధికమైంది. దీనికి అనుగుణం గా హమాలీల సంఖ్య 155కు చేరింది. అయినా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయాల్లో వారికి కనీస సౌకర్యాలు లేక పోవడం సమస్యగా మారింది.

కనీస సౌకర్యాలు కరువు
గూడ్స్‌ రైల్‌ బోగి కింద సేద తీరుతున్న హమాలీలు (ఫైల్‌)

- గూడ్స్‌ షెడ్‌ లేక రైల్వే హమాలీల అవస్థలు

- తాగునీరు కూడా లేని దుస్థితి

- అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం

గద్వాల అర్బన్‌, నవంబరు 2 : గద్వాల రైల్వేస్టేషన్‌ జంక్షన్‌గా మారింది. ప్రయాణికుల సంఖ్యతో పాటు సరుకుల రవాణా కూడా అధికమైంది. దీనికి అనుగుణం గా హమాలీల సంఖ్య 155కు చేరింది. అయినా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమయాల్లో వారికి కనీస సౌకర్యాలు లేక పోవడం సమస్యగా మారింది. తాగునీటి వసతి కూడా లేకపోవడం గమనార్హం. రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ ఏర్పాటు కోసం 60 ఏళ్ల క్రితమే ఇక్కడి సంస్థానాధీశులు వంద ఎకరాలను ఉచితంగా అందించారు. అయినా కావలసిన సదుపాయాలను సమకూర్చుకోలేక పోవడం ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారుల వైఫల్యంగానే మిగిలింది. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులకు పలుమార్లు వివరిం చినా తమ గోడు పట్టించుకోవడం లేదని హమాలీలు వాపోతున్నారు.

నిలువ నీడ లేక ఇక్కట్లు

గద్వాల రైల్వేస్టేషన్‌కు ఏడాదిలో వందల సంఖ్యలో గూడ్స్‌ బండ్లు వచ్చిపోతుంటాయి. సగటున వారానికి రెండు నుంచి మూడు సార్లు వ్యాగన్లు వస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ సీజన్‌ ఆరంభమైన వెంటనే రసాయనిక ఎరువుల బస్తాలు ఇక్కడికి వస్తాయి. వాటి అన్‌లోడింగ్‌ కోసం కొన్ని సందర్భాల్లో హమాలీలు వంతుల వారీగా, రోజుల తరబడి స్టేషన్‌ వద్దే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వర్షం వచ్చినా, ఎండ మండి నా వారికి నిలువ నీడ కూడా లేదు. దీంతో హమాలీలు విధిలేక రైల్వే బోగీల కిందనే తలదాచుకోవాల్సి వస్తోంది. వీటితో పాటు జాతీయ రహదారి సమీపంలో కొండేరు వద్ద ఉన్న పౌల్ర్టీ దాణా ఫ్యాక్టరీకి కేరళ నుంచి తరచుగా మొక్కజొన్న వస్తోంది. ఇక్కడి నుంచి బియ్యం రవాణా కూడా గణనీయంగా పెరిగింది.

స్పందించని అధికారులు

తమ సమస్యల గురించి పలుసార్లు విన్నవించినా, ఉన్నతాధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడంపై హమాలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ల పరిశీ లన కోసం ఇక్కడి వచ్చే ప్రతీ అధికారికి, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ జనరల్‌ మేనేజర్‌కు లిఖిత పూర్వకంగా తమ సమస్యను వివరించినా పరిశీలిస్తా మన్న మాట తప్ప, చర్యలు తీసుకోవడం లేదని చెప్తు న్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఇటీవల గద్వాల రైల్వేస్టేషన్‌లో వారం రోజుల పాటు నిర్వహించిన ‘ఆజాదీకా రైల్‌గాడీ’ కార్యక్రమంలో పాల్గొ నేందుకు వచ్చిన ఉన్నతాధికారులకు హమాలీలు తమ సమస్యను విన్నవించుకున్నారు. కానీ ఎవరి నుంచీ తగిన హామీ లభించలేదని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దిశగా ఇక్కడి ప్రజా ప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలని హమాలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిలువ నీడ ఏర్పాటు చేయాలి

పర్ష, రైల్వే హమాలీ యూనియన్‌ అధ్యక్షుడు : గద్వాల రైల్వేస్టేషన్లో 150 మందికి పైగా హమాలీలు పని చేస్తున్నారు. షిఫ్ట్‌ పద్ధతిన వంతుల వారీగా విధులు నిర్వహించే మాకు నిలువ నీడ ఏర్పాటు చేయాలి. తాగునీరు, సేద తీరేందుకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలి.

తాత్కాలిక షెడ్‌ ఏర్పాటు చేయాలి

లక్ష్మన్న , రైల్వే హమాలీ : చలికాలం ఆరంభం అయినందున రాత్రి వేళ విధులు నిర్వహించే వారు తలదాచుకు నేందుకు తాత్కాలికంగా షెడ్‌ ఏర్పాటు చేయాలి. తాగునీరు లేక కొనుగోలు చేయాల్సి వస్తోంది. కుళాయిలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి.

త్వరలోనే సమస్యలకు పరిష్కారం

కార్మికుల కోసం గూడ్స్‌షెడ్‌ వద్ద ఉన్న షెల్టర్‌ గదిలో తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాదికారులు నిర్ణయించారు. వచ్చే నెలలో మర్చంట్స్‌ గది నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పనుల కోసం నిధులు మంజూరయ్యాయి. డిపార్ట్‌మెంట్‌ ద్వారానే పనులు చేపట్టనున్నారు.

- సుమిత్‌కుమార్‌, స్టేషన్‌మాస్టర్‌

Updated Date - 2022-11-02T22:58:46+05:30 IST