ప్రజలను కుదువబెట్టిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-30T05:15:13+05:30 IST

తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ కుదువబెట్టారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

ప్రజలను కుదువబెట్టిన కేసీఆర్‌
కొత్తకోటలో జరిగిన సభలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

 - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

కొత్తకోట, సెప్టెంబరు 29: తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ కుదువబెట్టారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా నిర్వహించిన బైక్‌ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తకోటలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన రోజు 74 వేల కోట్ల అప్పుంటే  ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్‌ ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కరిపై రూ.1. 25 లక్షల అప్పుమోపాడని ఆరోపించారు. చదువుకున్న యువతకు ఉద్యోగాల నోటిఫికేషన్‌ వేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇదుగో ఉద్యోగాలు. అదిగో నోటిఫికేషన్‌ అంటూ కాలం వెలదీస్తున్నారని ఆరోపించారు. కమీషన్‌లు వచ్చే పనులనే కేసీఆర్‌ చేస్తున్నాడని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు.  బాసర త్రిబుల్‌ ఐటీ విద్యార్థులు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆందోళన నిర్వహించినా ప్రభుత్వం కనికరించలేదంటే  ఎంత దుర్మార్గమో ఆలోచించాలన్నారు. కానీ నిన్న మంత్రులు బాసరకు వెళ్లి మీ ఆందోళన మంచిదేనని కితాబు ఇవ్వడం తెలివి తక్కువ తనానికి నిదర్శనమని విమర్శించారు. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశానికి మంచి పాలన అందిస్తున్నారని, ఇక్కడ కూడా మీ ఆశీర్వాదం ఇస్తే కాషాయ జెండా ఎగుర వేసి ప్రధాని తరహా సుపరిపాలన అందిస్తామన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. సభకు జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించగా డోకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి, ఎగ్గని నర్సిహ్ములు, ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T05:15:13+05:30 IST