ఆమే ఒక సైన్యం

ABN , First Publish Date - 2022-09-20T04:47:27+05:30 IST

వైఎస్‌ఆర్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర పాలమూరులో ముగిసింది. వైఎస్‌ఆర్‌ సంక్షేమ రాజ్య సాధనే ఏకైక లక్ష్యమంటూ చేపట్టిన ఆమె పాదయాత్ర ఆసాంతం తానే రాజు, తానే మంత్రి, తానే సైనికుడిలా సాగింది.

ఆమే ఒక సైన్యం
ఇటీవల సీసీకుంటలో పాదయాత్ర చేస్తున్న షర్మిల(ఫైల్‌)

అన్నీ తానై పాదయాత్ర నిర్వహించిన వైఎస్‌ షర్మిల

పాలమూరులో 38 రోజులు కొనసాగిన ప్రజా ప్రస్థానం

మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలతో పాదయాత్రపై అందరి దృష్టి

స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు

దమ్ముంటే అరెస్టు చేయాలని సవాల్‌ విసరడంతో పతాకస్థాయికి చేరిన ఘర్షణ 

బలం, బలగం లేకపోయినా స్ఫూర్తివంతంగా యాత్ర కొనసాగించారనే కితాబు


వైఎస్‌ఆర్‌ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర పాలమూరులో ముగిసింది. వైఎస్‌ఆర్‌ సంక్షేమ రాజ్య సాధనే ఏకైక లక్ష్యమంటూ చేపట్టిన ఆమె పాదయాత్ర ఆసాంతం తానే రాజు, తానే మంత్రి, తానే సైనికుడిలా సాగింది. కొడంగల్‌ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన రోజు సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి మినహా ఉమ్మడి జిల్లాలో ప్రాబల్యమున్న నాయకుడు గానీ, బలమైన క్యాడర్‌ గానీ లేకున్నా ఏ రోజూ ఆటంకం ఎదురుకాలేదు. ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర కొనసాగిన 13 నియోజకవర్గాల్లోనూ ఒకరిద్దరు సీనియర్‌ నాయకులు మాత్రమే పాదయాత్రకు మార్గనిర్దేశం చేశారు తప్పా రాజకీయాల్లోకి రావాలని తహతహలాడే నవయువతనే ఆమె వెంట నడిచారు.


రికార్డు స్థాయిలో పాదయాత్ర

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు జిల్లాల్లో 38 రోజులు కొనసాగిన షర్మిల పాదయాత్ర 544 కిలోమీటర్లు సాగింది. వికారాబాద్‌లోని కొడంగల్‌ నియోజకవర్గంలో కొనసాగిన మొత్తం పాదయాత్రను పరిగణనలోకి తీసుకుంటే 13 నియోజకవర్గాల్లో 40 రోజుల పాటు పాదయాత్ర చేసిన షర్మిల 586 కిలోమీటర్లు నిర్వహించి రికార్డు సృష్టించారు.  ఆగస్టు 9వ కొడంగల్‌ నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర సెప్టెంబరు 18న జడ్చర్ల నియోజకవర్గం దాటి షాద్‌నగర్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ జిల్లాలోని కొత్తకోట వద్దే ఆమె 2,000 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. మొత్తం పాదయాత్రలో ఒక్కరోజు ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యే నిమిత్తం వాయిదా వేశారు.


ప్రజలను పలకరిస్తూ.. హామీలపై నిలదీస్తూ..

పాదయాత్ర ఆరంభంలో సాదాసీ దాగా మొదలైంది. ఆమె ప్రతీ రోజు నిర్ణీత రూట్‌మ్యాప్‌తో నడవ డంతో పాటు మార్గంమధ్యలో వివిధ వర్గాలను కలవడం, ప్రధాన గ్రామా ల్లో మాటా-ముచ్చట నిర్వహించడం, సభలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరిపారు. ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడ దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో జరిగిన మేళ్లను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం హామీలు అమలుకు డిమాండ్‌ చేశారు.


చివరలో తారా స్థాయికి..

షర్మిల ప్రతీ మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ పాదయాత్ర సందర్భంగా షర్మిల ఖండిస్తూ ఆమె తీవ్ర పదజాలాన్ని ప్రయోగించడంతో పాటు, సవాళ్లు విసరడం రాజకీయ ఘర్షణకు దారితీసింది. టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి కూడా షర్మిల వ్యాఖ్యలపై ఖండనలు, నిరసనలు వ్యక్తమైనా ఆమె వెనుకడుగు వేయకుండా అదే ఉధృతిని దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లో  కనబరిచారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన ప్రివిలేజ్‌ కమిటీకి నివేదిస్తానని హామీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం షర్మిల మరింత దూకుడుగా తన తండ్రి వైఎస్‌ఆర్‌ని కుట్ర చేసి చ ంపినట్లే, తనని చంపవచ్చని, కానీ, ఎన్ని కుట్రలు పన్నినా పాదయాత్ర ఆపేది లేదంటూ బేడీలు వేసే దమ్ముంటే వేయాలని, అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర ముగిసే సమయానికి రాజకీయవర్గాలతో పాటు అధికారవర్గాలు, ప్రజల్లోనూ షర్మిల ఏం మాట్లాడబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొనడం ఆమె పాదయాత్రకు వచ్చిన గుర్తింపుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.Read more