కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే అన్యాయం

ABN , First Publish Date - 2022-09-12T04:57:19+05:30 IST

సీఎం కేసీఆర్‌ చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టుకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే అన్యాయం
హర్షవర్ధన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తున్న నాగం జనార్దన్‌రెడ్డి

‘పాలమూరు’ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం

ప్రాజెక్టులపై ప్రజలను చైతన్యం చేయాలి : మాజీ మంత్రి నాగం

రెండు రోజుల దీక్ష విరమించిన హర్షవర్ధన్‌ రెడ్డి


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 11: సీఎం కేసీఆర్‌ చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టుకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధమని, జైల్లో పెట్టినా.. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్ఠం చేశారు. నీళ్ల కోసం కాంగ్రెస్‌ నాయకుడు జి.హర్షవర్దన్‌రెడ్డి చేపట్టిన రెండ్రోజుల నిరాహార దీక్షకు నాగం ఆదివారం మద్దతు ప్రకటించారు. శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆ రూ.5 లక్షల కోట్లలో రూ.లక్ష కోట్లు ఇళ్ల నిర్మాణాలకు వెచ్చించి ఉంటే 20 లక్షల మందికి ఆవాసాలు లభించేవన్నారు. రిజర్వా యర్లు కడితే అందులో బోట్లు ఏసుకుని తిరగాలా? డిస్ట్రిబ్యూటరీ పనులు ఎవరు చేయాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను చైతన్యం చేయాలని, హర్షవర్దన్‌రెడ్డి చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నారని అన్నారు. కాళేశ్వరం వరదల వల్ల మునగలేదని, సీఎం నిర్లక్ష్యం కారణంగానే మునిగిపోయిందని చెప్పారు. గతేడాది కూడా కాళేశ్వరం ద్వారా చుక్క నీరు ఇవ్వలేదని, కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఖతం చేశారని అన్నారు. దీనిపై చర్చకు ఎవరొస్తారో రావాలని సవాల్‌ చేశారు. కేసీఆర్‌కు ఈడ సక్కగ పరిపాలించిండని దేశంలో పార్టీ పెడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డికి రూ. 35 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు రూ.లక్ష కోట్లు అంటోందని, అయినా పనులు పూర్తి చేయలేదని అన్నారు. వచ్చిన కాడికి కమీషన్లు దండుకుని ప్రజల నోట్లో మట్టికొట్టారన్నారు. పాలమూరు ప్రజలు తలుచుకుంటే కేసీఆర్‌కు భవిష్యత్తు ఉండదని తేల్చిచెప్పారు. హర్షవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరుకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. అన్ని వర్గాల వారు కదిలిరావాలన్నారు. అనంతరం నాగం నిమ్మరసం ఇచ్చి హర్షవర్దన్‌రెడ్డి చేత దీక్ష విరమింపచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీతాదయాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఎం.రాఘవాచారి, కాంగ్రెస్‌ నాయకులు సంజీవ్‌ ముదిరాజ్‌, బెక్కరి అనిత, ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, సిరాజ్‌ఖాద్రి, సాయిబాబ, మధుసూదన్‌రెడ్డి, అబ్దుల్‌హక్‌, ఆప్‌ నాయకులు బాబుల్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2022-09-12T04:57:19+05:30 IST