వానొస్తే వణుకు

ABN , First Publish Date - 2022-09-12T04:55:11+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో రహదారులపై వాగులు, వంకలు పారుతున్న చోట హైలెవల్‌ వంతెనలు, వంతెనలు నిర్మించకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వానొస్తే వణుకు
పెద్దవాగు వరద నీటి కారణంగా ఎక్కడివారు అక్కడే నిలిచిన అయిజ, చిన్నతాండ్రపాడు గ్రామస్థులు(ఫైల్‌)

రహదారులను ముంచెత్తుతున్న వాగులు 

లోలెవల్‌ వంతెనలతో ఇక్కట్లు 

కల్వర్టు వంతెనలతో పాట్లు 

ఎక్కడి వాహనాలు అక్కడే  

నిలిచిపోతున్న రాకపోకలు  

గ్రామాలకు తెగిపోతున్న సంబంధాలు 

వైద్యం అవసరమైతే వాగుల్లోంచే నడిచి వెళ్లాలి 

ఇదీ జోగుళాంబ గద్వాల జిల్లాలో పరిస్థితి


అయిజ, సెప్టెంబరు 11: జోగుళాంబ గద్వాల జిల్లాలో రహదారులపై వాగులు, వంకలు పారుతున్న చోట హైలెవల్‌ వంతెనలు, వంతెనలు నిర్మించకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. ఆ సమయంలో ఎవరికైనా వైద్యం అవసరమై ఆస్పత్రులకు వెళ్లాలంటే నరకం చవిచూడాల్సి వస్తోంది. జిల్లాలోని అయిజ, కేటీదొడ్డి, ధరూరు, గట్టు, ఇటిక్యాల, రాజోలి, మానవపాడు, వడ్డేపల్లి, మల్దకల్‌, అలంపూర్‌ తదితర మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. అయిజ మండలం టీటీదొడ్డి, ఉత్తనూరు, మేడికొండ, బైనంపల్లి, వడ్డేపల్లి మండలం జూలకల్‌ వద్ద మూడు రాష్ర్టాలను కలిపై రహదారిపై, ఇటిక్యాల, అలంపూర్‌ వద్ద లోలెవెల్‌ వంతెనలు ఉన్నాయి. వీటితో పాటు పలు చోట్ల కల్వర్టు వంతెనలు నిర్మించారు. వర్షాలు బాగా కురిసినప్పుడు జిల్లాలోని మేడికొండ వద్ద గల పోలోని వాగు, ఉత్తనూరు వద్ద గల లింగమ్మ చెరువు, వడ్డేపల్లి మండలం జూలకల్‌ వాగు, అయిజ మండలం పెద్ద వాగులు పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ వాగులతో పాటు ఆయా గ్రామాల వాగులు, వంకలు లోలెవల్‌ వంతెనలు, కల్వర్టుల మీదుగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.


జలదిగ్బంధంలో గ్రామాలు

వర్షం వచ్చిందంటే జిల్లాలోని చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసర సరకులు, వ్యవసాయ అవసరాలు, ఆస్పత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఒక్క అయిజ మండలంలోనే దాదాపు 21 గ్రామాల ప్రజలు వర్షాలు కురిసినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. మండలంలోని ఉత్తనూర్‌, భూమ్‌పూర్‌, టీటీదొడ్డి, సింధనూర్‌, కుట్కనూర్‌, బైనపల్లి, కొత్తపల్లి, రాజాపూర్‌, పులికల్‌, కిసాన్‌ నగర్‌తో పాటు చిన్నతాండ్రపాడు, వేణిసోమ్‌పూర్‌, కేశవరం గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజోళి మండలంలోని చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, అలంపూర్‌ మండలంలోని శాగాపురం, సింగవరం గ్రామాలదీ అదే పరిస్థితి. 


ఎక్కడి వాహనాలు అక్కడే

గత గురువారం కురిసిన వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దాంతో వడ్డేపల్లి మండల పరిధిలోని జులెకల్‌ లోలెవల్‌ వంతెనపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అవసరమైన చోట హైలెవల్‌ వంతెనలు, వంతెనలు నిర్మించి వర్షం కురిసినప్పుడు పడే ఇబ్బందులను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇక్కట్లు

అయిజ మండలంలోని దేవబండ గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల పురిటి నొప్పులు వచ్చాయి. వర్షాలకు పెద్దవాగు ప్రవహిస్తున్నందున వాహనాలు కూడా వాగు దాటలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో కుటుంబీకులు, బంధువులు ఆమెను చేతులపై వాగులోంచి తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించారు. 

రాజోలి మండలం చిన్న ధన్వాడకు చెందిన ఓ గర్భిణి కాన్పు కోసం గత గురువారం కర్నూలుకు వెళ్తుండగా, వడ్డేపల్లి మండలం జూలకల్‌ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మానవపాడు మీదుగా జాతీయ రహదారి వెంట కర్నూలుకు వెళ్లింది.

అయిజ మండలం బైనపల్లికి చెందిన కుర్వ లింగన్న తన కుమారుడితో గురువారం స్వగ్రామానికి అయిజ నుంచి బయల్దేరాడు. మేడికొండ సమీపంలో బైక్‌పై వాగును దాటేందుకు ప్రయత్నించారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో బైకు వరదలో కొట్టుకుపోయింది. తాను, తన కుమారుడు జనం సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 

కర్నూల్‌ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అయిజ వైపు బైక్‌ను వస్తున్న ఇద్దరు జూలకల్‌ వాగు దాటే క్రమంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

పెద్ద వాగు గుండా ఉప్పల్‌దొడ్డి మీదుగా గతంలో వద్ద ఎద్దుల బండి వెళ్తుండగా, బండి బోల్తాపడి ఎద్దులు, యువకుడు చనిపోయాడు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. వాగులు ప్రవహిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టి వెళ్లాల్సి వస్తోంది.

Read more