చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-30T04:46:35+05:30 IST

రైతులు చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి మురళి అన్నారు.

చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం
లింగోటంలో కృష్ణయ్య పంటను పరిశీలిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి మురళి

- కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి మురళి

అచ్చంపేట అర్బన్‌, సెప్టెంబరు 29: రైతులు చిరుధాన్యాల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి మురళి అన్నారు. గురువారం మండల పరిధిలోని లింగోటం గ్రామంలో అచ్చంపేట ఏడీఏ చంద్రశేఖర్‌తో కలిసి రైతు కృష్ణయ్య పొలంలో సాగుచేసిన రాగుల పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రాగులు, సజ్జలు కొర్రలు, గోధుమ పంటలను సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపాలన్నారు. చిరుధాన్యాల పంటలు సాగుచేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చన్నారు. రసాయన ఎరువుల వాడకంతో ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయని, సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయాలన్నారు. రైతులు సాగుచేసిన చిరుధాన్యాల పంటలను డ్రోన్‌ కెమెరా ద్వారా షార్ట్‌ ఫిలిం తీసి రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు తక్కువ స్థాయిలో పంటలు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం చిరుధాన్యాలకు మార్కెట్‌లో ధర అధికంగా ఉందన్నారు. ఏవో కృష్ణయ్య, ఏఈవో లక్ష్మణ్‌ సింగ్‌, రైతులు పాల్గొన్నారు.


చిరు ధాన్యాలతోనే ఆరోగ్యం

బల్మూరు: చిరుధాన్యాల పంటలను ఐఐఎంఆర్‌ సెంట్రల్‌ శాస్త్రవేత్తలు, బృందం సభ్యులు మురళి మితిన్‌ ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని మైలారం, అనంతవరం గ్రామాల్లో చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు పండించే రైతులతో  షార్ట్‌ ఫిలిం చిత్రీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో చిరుధాన్యాలు పండించే రైతుల పంట వివరాలను సాగు విధానాన్ని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. రైతులు కలుపు నివారణకయ్యే ఖర్చును వారు అంచనా వేశారు. కేంద్ర, వ్యవసాయ శాఖ సలహా మే రకు చిరుధాన్యాలు రాగులు, సజ్జలు, కొర్రలు, సాములు, అరికెలు, పచ్చజొన్న లు వంటి పంటలను సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఉద్దేశంతో కేంద్ర ప్ర భుత్వ వ్యవసాయ శాఖ భావిస్తుందని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో గోధుమలు, బియ్యం ఎక్కువగా వాడుతున్నారని, అందువల్ల దేశవ్యాప్తంగా షుగరు, బీపీ ఇతర రోగాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని తగ్గించేందుకు చిరుధాన్యాలను అందించే విధంగా కృషి జరుగుతుందని తెలి పారు. ఏడీఈ చంద్రశేఖర్‌, మండల వ్యవసాయ అధికారి మహేష్‌కుమార్‌, ఏఈవో పవన్‌, రైతులు నిరంజన్‌, నర్సింగ్‌రావు, వెంకట్‌రావు  పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-30T04:46:35+05:30 IST