ఆరోగ్య సిరి

ABN , First Publish Date - 2022-05-19T04:45:42+05:30 IST

నిరుపేదల పాలిట వరంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య పెరిగింది.

ఆరోగ్య సిరి
మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మిత్ర విభాగం

ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదాయం తెచ్చిపెడుతున్న ఆరోగ్య శ్రీ పథకం

వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేలల్లో నమోదు

ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,975 కేసుల్లో చికిత్స

రూ. 6.30 కోట్ల ఆదాయం రాక

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలతో పథకానికి కొత్త ఊపు


 నిరుపేదల పాలిట వరంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు పెంచాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ మేరకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డిసెంబర్‌ 2021 నుంచి ఇప్పటి వరకు 3,975 కేసులకు చికిత్స అందించారు. దాంతో ఆస్పత్రులకు రూ.6.30 కోట్ల ఆదాయం వచ్చింది. 

- మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం)


 ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరోగ్య శ్రీ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబర్‌ 2021 నుంచి ఈ ఏడాది మే 11 వరకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,975 కేసులు ఆరోగ్యశ్రీ కింద నమోదయ్యాయి. అధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, సీహెచ్‌సీ బాదేపల్లిలో కలిపి 1,413 కేసులు చేశారు. వనపర్తి జిల్లాలోని జిల్లా ఆస్పత్రిలో 830, రేవల్లి సీహెచ్‌సీలో 20, ఆత్మకూరు సీహెచ్‌సీలో 47, గద్వాల జిల్లా ఆస్పత్రిలో 648, అలంపూర్‌ సీహెచ్‌సీలో 4 కేసులకు చికిత్స చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని జిల్లా ఆస్పత్రిలో 490, కల్వకుర్తి సీహెచ్‌సీలో 64, అచ్చంపేట సీహెచ్‌సీలో 23, పాలెం సీహెచ్‌సీలో 18, లింగాల్‌ సీహెచ్‌సీలో 1, అమ్రాబాద్‌ సీహెచ్‌సీలో 2, నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో 415 కేసులు చేశారు. కేసులు పెరుగుతుండటంతో ఆరు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రోత్సాహక నిధులు పెరుగుతున్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు రూ.2,64,60,475 ఆదాయం వచ్చింది. 


మంత్రి హరీశ్‌రావు చొరవతో..

ఉమ్మడి జిల్లాలో గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయమంతా ఆ ఆస్పత్రులకు మాత్రమే వెళ్లేది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌రావు ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో గతంలో ఆరోగ్యశ్రీ కింద 100 కేసులు కూడా దాటని ఆస్పత్రులు ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. ఈ పథకంలో భాగంగా ఆపరేషన్‌ చేసిన కేసుకు ఇచ్చే ప్రోత్సాహకంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. మంత్రి నిర్ణయంతో వైద్యాధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు పెంచే పనిలో పడ్డారు. 

Read more