వైభవంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T05:11:15+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సద్దుల బతుకమ్మ
కోలాటం ఆడుతున్న మహిళలు

పాలమూరులో టూరిజం విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు 

కిటకిటలాడిన జడ్పీ మైదానం 

ఆట పాటలతో చిందేసిన మహిళలు, ఉద్యోగులు


మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 3: మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. టూరిజం విభాగం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లపై బతకమ్మలను ఏర్పాటు చేసి, విద్యుత్‌ లైట్లతో అలంకరించారు. సాయంత్రం నుంచి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి బతకమ్మలను మేళతాళాలతో జిల్లా పరిషత్‌ మైదానానికి తీసుకొచ్చారు. మైదానంలో ఒక్కో విభాగానికి బతుకమ్మ ఆడేందుకు ప్రత్యేక సర్కిళ్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఆట, పాటల తర్వాత బతకమ్మలను మయూరి నర్సరీ ముందుగల చెరువులో నిమజ్జనం చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణి శారద, కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు దంపతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవర్‌ పర్యవేక్షించారు.


పాల్గొన్న మంత్రి 

ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, పూజలు చేశారు. బతకమ్మతో పాటు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ బతకమ్మలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా నగదును, ఇద్దరికి కన్సోలేషన్‌ బహుమతులను అందజేశారు.

Read more