మురుగుతున్న మొలకలు

ABN , First Publish Date - 2022-08-02T04:45:05+05:30 IST

ఖరీఫ్‌లో పత్తి సాగుచేసుకున్న రైతులు ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో ఆందోళన చెందుతు న్నారు.

మురుగుతున్న మొలకలు
అప్పిరెడ్డిపల్లిలో వర్షపు నీటిలో ఉన్న పత్తి పైరు

- పత్తి పొలాల్లో నిలిచిన వర్షపు నీరు

- ఆందోళనలో అన్నదాతలు

నారాయణపేటరూరల్‌, ఆగస్టు1: ఖరీఫ్‌లో పత్తి సాగుచేసుకున్న రైతులు ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో వర్షపు నీరు నిలుస్తుం డటంతో పత్తి మొక్కలు కుళ్లిపోతున్నాయి.  నెల క్రితం రైతులు పత్తి విత్తుకోగా అప్పట్లో వర్షాలు రాకపోవడంతో  విత్తనాలు మొలకెత్తలేదు. దాంతో మళ్లీ విత్తుకున్నారు. అయితే, పక్షం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో ఇప్పటికే కొంతమేర మొలకెత్తిన పత్తి పంటల్లో కలుపు విపరీతంగా  పెరిగిపోయింది. ఇప్పటికే  ఎకరాకు రూ. 10వేల నుంచి రూ.15వేల దాకా పెట్టుబడి పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం కలుపు తీసి మొలకలకు డీఏపీ లేదా కాంప్లెక్‌ ఎరువులు వేస్తే మొక్కల ఎదుగుదలకు అవకాశముంటుందని, కానీ ప్రస్తుత ముసురు వర్షాలతో కలుపు తీసేందుకు ఆస్కారం లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా సోమవారం ఉదయం నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు నిలిచిందని  రైతులు వాపోతున్నారు.  ఈ ఖరీఫ్‌లో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.71లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. కాగా, పెట్టిన పెట్టుబడి సైతం ఈ సారి రైతులకు దక్కేలా లేదని,  ఇప్పటికైనా వర్షాలు తగ్గి రైతులకు అనుకూలిస్తే కనీసం పెట్టుబడి అయినావచ్చే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా వర్షాలు తగ్గితేనే  పంటలు చేతికి రావచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు.  



Updated Date - 2022-08-02T04:45:05+05:30 IST