చెత్త వసూళ్లు

ABN , First Publish Date - 2022-11-18T23:00:59+05:30 IST

వనపర్తి మునిసిపాలిటీలో ప్రజల నుంచి అదనపు బాదుడుకు పాలకవర్గం రంగం సిద్ధం చేసింది.

చెత్త వసూళ్లు
ట్రాక్టర్‌ ద్వారా చెత్తను సేకరిస్తున్న కార్మికులు

వనపర్తి పురపాలికలో చెత్త సేకరణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు తీర్మానం

ఇకపై ప్రతీనెలా బాదుడు

ఇంటికి రూ.60, దుకాణాలకు రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు

ఇప్పటివరకు వసూలు చేసే పన్నులు కాకుండానే అదనం

వనపర్తి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వనపర్తి మునిసిపాలిటీలో ప్రజల నుంచి అదనపు బాదుడుకు పాలకవర్గం రంగం సిద్ధం చేసింది. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులతోపాటు ఇక నుంచి చెత్త సేకరణ కోసం పుర ప్రజలు ప్రతీనెలా డబ్బులు చెల్లించేందుకు ప్రజాప్రతినిధులు తీర్మానం చేశారు. తాజా తీర్మానంతో ప్రతీనెలా లక్షల రూపాయలు పుర ప్రజలపై భారం పడే అవకాశం ఉంది. సాధారణంగా మునిసిపాలిటీ లేదా పంచాయతీల పరిధిలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను విధిగా చెల్లించాలి. ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బును పాలకవర్గం, అధికారులు కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు చెత్త సేకరణ, పారిశుధ్యం కోసం ఖర్చు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో నుంచి చెత్త సేకరణను తొలగించి, దానికి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది. మునిసిపల్‌ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే భువన్‌ యాప్‌ సర్వే తర్వాత నూతన అసెస్‌మెంట్లు నిర్ణయించడం వల్ల పుర పన్నుల భారం ప్రజలపై పెరిగింది. దీనికితోడు ఏటా పన్నులు చెల్లిస్తున్నా, పాలకవర్గం కనీస మౌలిక సదుపాయాలు చాలా కాలనీల్లో కల్పించడం లేదు. అయినప్పటికీ అదనపు బాదుడుకు రంగం సిద్ధం చేయడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఈ తీర్మానానికి ఇటు అధికారపక్షం ప్రతినిధులతోపాటు ఇతర పార్టీల ప్రతినిధులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో తీర్మానం లోపభూష్టంగా ఉందనే చర్చ నడుస్తోంది. ఏటా పన్నులు చెల్లించేదే మౌలిక వసతులు, చెత్త సేకరణ, పారిశుధ్యం కోసం అయినప్పుడు ఈ అదనపు బాదుడు ఎవరి కోసమో అర్థం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి..

ప్రస్తుతం వనపర్తి పట్టణంలో మునిసిపాలిటీనే చెత్తను సేకరిస్తోంది. మొత్తం 142 మంది కార్మికులు ఉండగా, ఇందులో కేవలం చెత్త సేకరణ కోసం 40 మందిని కేటాయించే వారు. మొత్తం 15 ట్రాక్టర్లు, 14 ఆటోల ద్వారా చెత్త సేకరణ చేసేవారు. తాజా తీర్మానం ప్రకారం ఇకపై మునిసిపాలిటీ చెత్త సేకరించదు. ఆ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇప్పుడున్న కార్మికులను ఇతర పారిశుధ్యం, హరితహారం, స్పెషల్‌ టీంల కోసం వినియోగించుకోనున్నారు. ప్రైవేటు వ్యక్తులు కేవలం డీజిల్‌ పోసుకుని, చెత్త సేకరణ చేయాల్సి ఉంటుంది. అయితే వాహనాలు మాత్రం మునిసిపాలిటీవే ఉంటాయి. మొత్తం 14 ఆటోలు, 3 ట్రాక్టర్లను సదరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు. చెత్త సేకరణ కోసం ఒక్కో ఇంటికి రూ.60 చొప్పున, వాణిజ్య దుకాణాలు, ఫంక్షన్‌ హాళ్లు తదితర వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తారు. ప్రజలు వారికి కచ్చితంగా నెలనెలా డబ్బులు చెల్లించాల్సిందే. లేకపోతే చెత్త సేకరించరు. ఇప్పటి వరకు చెత్త సేకరణ కోసం ప్రజలు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించ లేదు. కానీ కానీ ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. ఈ వసూళ్లకు మునిసిపాలిటీకి సంబంధం లేదు. ప్రైవేటు వ్యక్తులకే ఆ బాధ్యత ఉంటుంది. మునిసిపాలిటీ వాహనాల్లో డీజిల్‌ పోసుకోవడం కోసం అంత మొత్తంలో ప్రజలు డబ్బులు చెల్లించాలి. సాధారణంగా మునిసిపాలిటీలో ఏదైన పని చేయాలన్నా, ప్రైవేటు వ్యక్తులకు ఏవైన బాధ్యతలు అప్పగించాలన్నా టెండర్‌ వేయాలి. టెండర్‌ దక్కించుకున్న వారు మునిసిపాలిటీకి సొమ్ము చెల్లించి. ప్రజల నుంచి వసూలు చేసుకోవాలి. ఉదాహ రణకు తైబజార్‌ అలానే నడుస్తుంది. కానీ చెత్త సేకరణ బాధ్యతల విష యంలో టెండర్‌ లేన ట్లుగానే కనిపి స్తోంది. తద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉండదు. ఓ వైపు మునిసిపాలిటీకి ఆదాయం రాకపోగా, ప్రజలకు భారంగా మారే అవకాశం ఉంది.

రూ. లక్షల్లో బాదుడు..

మునిసిపాలిటీలో ప్రస్తుతం 16,870 నెంబర్లు ఉన్న ఇళ్లు ఉన్నాయి. ఇంటి నెంబర్‌ లేని ఇళ్లు మరో వెయ్యికిపైగా ఉంటాయి. మొత్తం కలిపితే సుమారు 18 వేల వరకు ఉంటాయి. ఒక్కో ఇంటిలో సగటున రెండు కుటుంబాలు నివసిస్తున్నాయని అంచనా వేసుకున్నా 36 వేల కుటుంబాలకు రూ.21.60 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. అలాగే కమర్షియల్‌ దుకాణాలకు సగటున రూ.300 చొప్పున వేసుకున్నా సుమారు వెయ్యి దుకాణాలకు రూ.3 లక్షల వరకు వసూలు చేయాలి. మునిసిపాలిటీ చేసిన తీర్మానానికి అనుగుణంగా వసూలు చేస్తేనే.. మొత్తం రూ. 24 లక్షల వరకు వస్తుంది. ఇందులో చెత్త సేకరణ చేసేవారు, డీజిల్‌కు రూ.10 లక్షల వరకు తీసివేసినా మరో రూ.14 లక్షలకు పైగానే మిగులుతుంది. ఈ ఆదాయమంతా ప్రైవేటు వ్యక్తులకు వెళ్లే అవకాశమే ఉంది. ప్రస్తుతం 20 వార్డుల్లో ఈ విధానం అమలు చేయనుండగా, రానున్న రోజుల్లో మొత్తం వార్డులకు వర్తింపజేయనున్నారు. ఒక్కసారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన తర్వాత వారు ఎంత వసూలు చేస్తున్నారు?, ప్రజలు ఎంత ఇస్తున్నారే లెక్కలు మునిసిపాలిటీ అధికారులకు బాధ్యత ఉండదు. దీంతో ప్రజలపై నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసే అవకాశం లేకపోలేదు. కేవలం సిబ్బంది కొరతను అధిగమించడం ద్వారా చేయాల్సిన పనిని మునిసిపాలిటీ పాలకవర్గం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. అయితే మునిసిపాలిటీ చట్టంలో చెత్త సేకరణకు చార్జ్‌ వసూలు చేయొచ్చనే నిబంధన ఉన్నట్లు అధికారులు పేర్కొంటుండగా, అది మునిసిపాలిటీ వసూలు చేయొచ్చా? లేదా ప్రైవేటు వ్యక్తులు వసూలు చేయాలా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా కాలనీలు శుభ్రంగా ఉంటాయని, ప్రజల నుంచి ఫిర్యాదులు రావని, చెత్త సేకరణ సరిగా చేయకపోతే ప్రజలు డబ్బులు కూడా వారికి ఇవ్వరని అంటున్నారు. అధికారులు, పాలకవర్గం కోణంలో ఇది సముచిత నిర్ణయంగా కనిపిస్తుండగా, ప్రజల కోణంలో మాత్రం అదనపు భారమనే చెప్పొచ్చు.

తాజా తీర్మానంతో మేలు

చెత్త సేకరణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల మేలు జరుగుతుంది. వారు చెత్త సేకరిస్తేనే ప్రజలు డబ్బులు ఇస్తారు కాబట్టి కచ్చితంగా పని చేస్తారు. దానివల్ల పట్టణం పరిశుభ్రంగా మారుతుంది. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉంది. దాన్ని అధిగమించాలనే ప్రయత్నంతోనే ఈ తీర్మానం చేశారు. మహబూబ్‌నగర్‌లాంటి మునిసిపాలిటీలో కూడా ఈ విధానం ఉంది. చట్టంలో కూడా చెత్త సేకరణకు చార్జ్‌ వేయవచ్చనే నిబంధన ఉంది. ఆ మేరకే ఈ ప్రతిపాదన చేశాం. ప్రజలకు కూడా ఎక్కువ భారం కాదు. ఎందుకంటే నెలకు రూ. 60 అంటే రోజుకు రూ. 2చొప్పున లెక్క. ప్రస్తుతం 20 వార్డుల్లో ఈ విధానం అమలుచేయనున్నాం. సత్ఫలితాలు వస్తే భవిష్యత్‌లో సొసైటీగా ఏర్పాటు చేసి, వనపర్తి పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

- విక్రమసింహారెడ్డి, కమిషనర్‌, వనపర్తి మునిసిపాలిటీ

Updated Date - 2022-11-18T23:00:59+05:30 IST

Read more