సరదా మాటున విషాదం

ABN , First Publish Date - 2022-09-14T04:43:09+05:30 IST

ప్రాజెక్టులు, జలపాతాల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అందమైన ప్రకృతిని తమ సెల్‌ఫోన్‌లలో బంధించాలన్న ఉత్సాహంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.

సరదా మాటున విషాదం
డిండి అలుగు వద్ద ప్రమాదకరంగా ఫొటోలు దిగుతున్న పర్యాటకులు(ఫైల్‌)

జలపాతాలు, ప్రాజెక్టుల వద్ద ప్రమాదాలు

సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్న యువత

భద్రతా చర్యలు చేపట్టని ప్రభుత్వం

మల్లెలతీర్థం జలపాతం వద్ద 15 ఏళ్లలో 9 మంది మృతి

డిండి ప్రాజెక్టు వద్ద కూడా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు


అచ్చంపేట, సెప్టెంబరు 13: ప్రాజెక్టులు, జలపాతాల వద్ద యువత సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. అందమైన ప్రకృతిని తమ సెల్‌ఫోన్‌లలో బంధించాలన్న ఉత్సాహంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని మల్లెల తీర్థం జలపాతం, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల సరిహద్దు గల డిండి ప్రాజెక్టు వద్ద ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. ఏళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తుండగా, 675 జాతీయ రహదారి అంచున గల దుందుభీ నదితో పాటు మల్లెల తీర్థం వంటి పర్యాటక ప్రాంతాల వద్ద భక్తులు, యాత్రికులు ఆగుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, సరదాగా గడుపుతున్నారు. అయితే అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు లేకపోడం, యువత అజాగ్రత్త వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెల తొమ్మిదిన మల్లెలతీర్థం జలపాతం వద్ద హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన ఆరీఫ్‌ సెల్ఫీ దిగుతూ జలపాతం లోయలో పడి మృతి చెందాడు. అదేవిధంగా ఈ నెల 10న షాద్‌నగర్‌ మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన మనోజ్‌ శ్రీశైలం నుంచి వస్తూ డిండి డ్యాం వద్ద సెల్ఫీలు దిగుతూ, జారిపడి మృతువాత పడ్డాడు. ఈ ప్రాజెక్టు వద్ద గతేడాది ఇదే మాసంలో గణేష్‌ నిమజ్జనం చేసి, తిరుగు ప్రయాణంలో ఇద్దరు యువకులు సెల్పీలు దిగుతూ జారి నీటిలో పడి మృత్యువాత పడ్డారు.


అందరూ యువకులే

గడిచిన 15 ఏళ్లలో అమ్రాబాద్‌ మండలంలోని మల్లెల తీర్థం వద్ద తొమ్మిది మంది ప్రమాదానికి గురై చనిపోయారు. వారంతా 15 నుంచి 30 ఏళ్ల వయస్సున్న వారే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డిండి ప్రాజెక్టు రెండేళ్లుగా వర్షాకాలంలో పరవళ్లు తొక్కుతోంది. దాంతో ప్రాజెక్టును చేసేందుకు పర్యాటకులు వరుస కడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జలపాతాలు, ప్రాజెక్టుకుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.





Updated Date - 2022-09-14T04:43:09+05:30 IST