జనవరి 18 నుంచి.. రెండో విడత కంటి వెలుగు

ABN , First Publish Date - 2022-12-12T23:23:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్య క్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించాలని సంకల్పించింది.

జనవరి 18 నుంచి..  రెండో విడత కంటి వెలుగు
మరికల్‌లో కంటి పరీక్షల కోసం నిరీక్షిస్తున్న ప్రజలు (ఫైల్‌)

- జిల్లాలో 24 బృందాలు ఏర్పాటు

- 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలు

నారాయణపేట, డిసెంబరు 11 : రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్య క్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించాలని సంకల్పించింది. ఇప్పటికే కలెక్టర్‌ శ్రీహర్ష నేతృత్వంలో ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఏపీవోలు, వైద్యశాఖ, పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వంద రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమున్న వారికి పూర్తిస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వైద్య శాఖ ఎంపీడీవోలకు అధికారాలు అప్పగించారు. నాలుగేళ్ల క్రితం మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో 2018, ఆగస్టు 15న ప్రారంభించి జనవరి 31 వరకు కొన సాగింది. వైద్యశాఖ ఆధ్వర్యంలో 16 బృందాలుగా ఏర్పడి, 11 మండలాల పరిధిలోని పీ హెచ్‌సీల్లో గల 336 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అప్పట్లో 3,64,803 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 40,987 మందికి రీడింగ్‌ అద్దాలు, పాయింట్‌ ఆర్డర్‌ కంటి అద్దాలను అందజేశారు. అయితే కంటి ఆపరేషన్ల కోసం 15,570 మందిని గుర్తించినా, గుర్తింపుకే పరిమితం కావడంతో కొందరు ప్రైవేటులో ఆపరేషన్లు చేయించుకోగా మరికొందరు స్వచ్ఛంద సంస్థలు, లయన్స్‌ క్లబ్‌ ఉచిత కంటి శిబిరాల్లో ఆపరేషన్లు చేయించుకోగా, ఇంకొందరు ఆపరేషన్ల కోసం నాలుగేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. ఇది వరకు గుర్తించిన వారికి కంటి ఆపరేషన్లతో పాటు రెండో విడతలో సకాలంలో కంటి చికిత్సలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:23:23+05:30 IST