మరో నలుగురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-01T05:16:54+05:30 IST

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అక్రమాలలో మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు.

మరో నలుగురి అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాజేశ్వర్‌గౌడ్‌, చిత్రంలో నిందితులు


- నిందితుల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, ముఖ్యనేత వ్యక్తిగత కార్యదర్శి కొడుకు

- వివరాలు వెల్లడించిన సీఐ రాజేశ్వర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 30 : డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల అక్రమాలలో మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను రూరల్‌ సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  ఆ వివరాలు..

పట్టణంలోని భగీరథకాలనీకి చెందిన ఆకుల కిరణ్‌ కుమార్‌కు అబ్దుల్‌ సిరాజ్‌కు కొంతకాలంగా పరిచయం ఉంది. తనకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇప్పించాలని సిరాజ్‌ను కిరణ్‌ కొరగా సిరాజ్‌ రూ.3.50 లక్షలు తీసుకున్నాడు. అయినా ఇల్లు ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇతనితోపాటు ఇదివరకు కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసి సస్పెండ్‌ అయిన అబ్దుల్‌ ఖాదర్‌తో కలిసి మరికొందరికి ఇళ్లు ఇప్పిస్తామని వారిద్ద రూ.9 లక్షలు, మొత్తం రూ.12.50 లక్షలు వసూలు చేశారు. సిరాజ్‌నుంచి రూ.2.50 లక్షలు రికవరీ చేసి అరెస్ట్‌ చేయగా, అబ్దుల్‌ ఖాదర్‌ పరారీలో ఉన్నాడు. 

 ముఖ్యనేత సహాయకుడి కొడుకు అరెస్ట్‌

ఒక ముఖ్యనేత వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్న దేవేందర్‌ కొడుకు అక్షయ్‌ ఇల్లు ఇప్పిస్తానని ఇద్దరి నుంచి రూ.లక్ష వసూలు చేయగా అతన్ని అరెస్ట్‌ చేశారు. దేవేందర్‌  వద్ద డ్రైవర్‌గా పనిచేసే కలాంపాషాకు దివిటిపల్లిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు మంజూరుకాగా, అది బాగాలేదని మరోచోట ఇల్లు ఇవ్వాలని దేవేందర్‌ను కోరగా అతను కుదరదని చెప్పాడు. దీంతో అతని కొడుకు అక్షయ్‌ను సంప్రదించగా అందుకు రూ.30 వేలు వసూలు చేశాడు. ఇంకా ఎవరికైనా ఇల్లు కావాలంటే ఇప్పిస్తానని అక్షయ్‌ చెప్పగా కలాంపాషా తనకు తెలిసిన మరో వ్యక్తిని పరిచయం చేయగా అతనికీ ఇల్లు ఇప్పిస్తానని రూ.70 వేలు తీసుకున్నాడు. వీరి ఆడియో టేపు లు కూడా వైరల్‌ అయ్యాయి. 

మరో బృందం రూ.5 లక్షలు వసూలు

ఇళ్లు ఇప్పిస్తామని మరో బృందం నలుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసింది. వనగంటి ప్రకాశ్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌లు తమకు తహసీల్దార్‌ కార్యాలయంలో బాగా పరిచయాలున్నాయని, ఇళ్లు ఇప్పిస్తామని ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు అవుతుందని అమాయకులను నమ్మించారు. పుట్నాలబట్టికి చెందిన బైర్వాడె సుధాకర్‌ వద్ద రూ. 2లక్షలు, లంగోటి ఆనంద్‌ వద్ద రూ.1.50 లక్షలు, గణేష్‌ దగ్గర రూ.లక్ష, గోవింద్‌ దగ్గర రూ.50 వేలు నగదు ఇలా మొత్తం నలుగురి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఇలా మూడు బృందాలకు చెందిన నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బందికి సీఐ రివార్డులు అందజేశారు. 

Read more