ఆర్డీవో కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-05-18T06:26:24+05:30 IST

పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ మల్లయ్య తమ భూములను కబ్జాచేసి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మంగళ వారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు రైతు బింగి కృష్ణయ్య పురుగుల మందు తాగేందుకు యత్నించాడు.

ఆర్డీవో కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం
పురుగుల మందు డబ్బాతో కొల్లాపూర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బాధిత రైతులు

- ఆర్‌ఎంపీ మోసం చేసి తమ భూములను లాక్కున్నారని ఆరోపణ

కొల్లాపూర్‌, మే 17 : పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ మల్లయ్య తమ భూములను కబ్జాచేసి వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మంగళ వారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ ఆర్డీవో కార్యాలయం ముందు రైతు బింగి కృష్ణయ్య పురుగుల మందు తాగేందుకు యత్నించాడు.  బాధిత రైతుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్‌ఎంపీ దగ్గర పెంట్ల వెల్లికి చెందిన ముగ్గురు రైతులు బింగి కృష్ణయ్య నాలుగెకరాల భూమిని తనఖా పెట్టి రూ. 60 వేల అప్పు, గోప్లాపూర్‌ గ్రామానికి చెందిన రంగారెడ్డి 10 ఎకరాల 10గుంటల భూమితో రూ. 20 వేలు, జటప్రోల్‌ గ్రామానికి చెందిన రైతు బీరయ్య రెండెకరాల భూమిని తనఖా పెట్టి రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పును దశల వారీగా రైతులంతా వడ్డీతో సహా చెల్లించినా ఇంకా అప్పు తీరలేదని తనఖాలో ఉన్న భూపత్రాలు ఇవ్వకుండా వేలల్లో చేసిన అప్పును లక్షల్లో చూపిస్తూ మొత్తం 16 ఎకరాల 10గుంటల భూమిపై తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో కేసులు నమోదు చేసి వేధిస్తున్నాడని రైతులు ఆరోపిస్తూ ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళ నకు దిగారు. ఈ సందర్భంగా రైతు బింగి కృష్ణయ్య తన వెంట తెచ్చు కున్న పురుగుల మందును ఆర్డీవో హనుమానాయక్‌ ముందే తాగేయత్నం చేయగా స్థానికులు, రైతులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఆ పరిసర ప్రాంతమంతా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులతో ఆర్డీవో మాట్లాడుతూ సమస్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.  

Read more