మహబూబ్‌నగర్‌-గద్వాల్‌ మధ్య విద్యుద్దీకరణ పూర్తి

ABN , First Publish Date - 2022-11-30T04:07:07+05:30 IST

దక్షిణమధ్య రైల్వే మహబూబ్‌నగర్‌ - గద్వాల్‌ మధ్య విద్యుద్దీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది.

మహబూబ్‌నగర్‌-గద్వాల్‌ మధ్య విద్యుద్దీకరణ పూర్తి

హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): దక్షిణమధ్య రైల్వే మహబూబ్‌నగర్‌ - గద్వాల్‌ మధ్య విద్యుద్దీకరణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రెండు స్టేషన్‌ల మధ్యగల 72.7 కిలోమీటర్ల ట్రాక్‌ విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన విద్యుద్దీకరణ ప్రాజెక్టు పనుల్లో భారతీయ రైల్వేలోని అన్ని జోన్‌లలో కంటే దక్షిణమధ్యరైల్వే ముందు వరుసలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యుద్దీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 385 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసిన ఎలక్ట్రికల్‌ వింగ్‌ అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అభినందించారు.

Updated Date - 2022-11-30T04:07:08+05:30 IST