ఆయిల్‌ మిల్లు పునరుద్ధరణకు కృషి

ABN , First Publish Date - 2022-06-08T05:14:34+05:30 IST

బీచుపల్లి ఆయిల్‌మిల్లును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని ఆయిల్‌ ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఆయిల్‌ మిల్లు పునరుద్ధరణకు కృషి
నర్సరీలో పెంచిన మొక్కలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడుతున్న చైర్మన్‌

- ఆయిల్‌ ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి

ఎర్రవల్లి చౌరస్తా, జూన్‌ 7 : బీచుపల్లి ఆయిల్‌మిల్లును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని ఆయిల్‌ ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బీచుపల్లి ఆయిల్‌మిల్లులోని నర్సరీ, ఆయిల్‌పామ్‌ తోటలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం పీల్ట్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి, ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రాంతం ఆయిల్‌పామ్‌ సాగుకు అనువైందన్నారు. ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సిద్ధిపేట, జనగాం, యాదాద్రి, నారయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. గద్వాల, నారాయణపేట జిల్లాల్లో సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సాధారణంగా ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన రెండు సంవత్సరాలకు కాపు మొదలవుతుంది కానీ, మొగ్గదశలోనే తుంచి వేస్తారని తెలిపారు. నాలుగవ సంవత్సరం నుంచి వచ్చే గెలలను హర్వెస్టింగ్‌ చేసి ప్యాక్టరీకి పంపిస్తారని చెప్పారు. కానీ బీచుపల్లి అవరణలో మూడేళ్ల క్రితం నాటిన ఆయిల్‌ పామ్‌ మొక్కలకు మంచిగా గెలలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎండీ సురేందర్‌, సత్యనారాయణ, టీఅర్‌ఎస్వీ జిల్లా కోఅర్డినేటర్‌ పల్లయ్య, రవళి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more