జాప్యం శాపం

ABN , First Publish Date - 2022-08-18T04:15:03+05:30 IST

పునరావాసం కల్పనలో జాప్యం నిర్వాసితులకు శాపంగా మారింది. ముంపు గ్రామాన్ని తరలించకపోవడంతో ఇటీవలి అధిక వర్షాలకు వచ్చిన వరద ఇళ్లను చుట్టేయడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

జాప్యం శాపం
ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలో వల్లూరు ఎస్సీ కాలనీని చుట్టుముట్టిన వరద నీరు(ఫైల్‌)

ఉదండాపూర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం

గ్రామాలు ఖాళీ చేయకుండానే కొనసాగుతున్న పనులు

వల్లూరు గ్రామాన్ని చుట్టుముట్టిన వరద

చెరువుల్లోకి నీరు వెళ్లే పాటు కాల్వలు డ్యామ్‌ పరిధిలోకి రావడంతోనే సమస్య

కట్ట నిర్మాణంతో రిజర్వాయర్‌లో నిలిచిన నీరు

కొలిక్కిరాని నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ

ఆందోళనలో బాధితులు


మహబూబ్‌నగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పునరావాసం కల్పనలో జాప్యం నిర్వాసితులకు శాపంగా మారింది. ముంపు గ్రామాన్ని తరలించకపోవడంతో ఇటీవలి అధిక వర్షాలకు వచ్చిన వరద ఇళ్లను చుట్టేయడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో నిర్మిస్తోన్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల్లో ఈ దుస్థితి దాపురించింది. 


ధ్వంసమైన పాటు కాల్వలు

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ కింద ముంపునకు లోనయ్యే వల్లూరు గ్రామం ఇటీవలి వర్షాలతో వచ్చిన వరదతో ఉక్కిరిబిక్కిరయింది. ఈ గ్రామం చుట్టూ నాలుగు చెరువులుండటం, ఆ చెరువులకు సమీపంలోని గుట్టల నుంచి వచ్చే వరదనీరు వెళ్లే పాటు కాల్వలు సహజసిద్ధంగా ఉండటంతో వర్షాలొచ్చినప్పుడు వరదనీరు గ్రామంలోకి రాకుండా చెరువుల్లోకి వెళ్లిపోయేది. తాజాగా ఇక్కడ 15.90 టీఎంసీల సామర్థ్యంతో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తుండటంతో ఈ పాటు కాల్వల వ్యవస్థ లేకుండాపోవడం, వచ్చే వరదంతా రిజర్వాయర్‌లోకే వస్తుండటం, ముంపు గ్రామం వల్లూరు వద్ద లోతట్టు ఉండటం వంటి కారణాలతో వరదనీరు అక్కడ ఆగిపోతోంది. ప్రధాన కట్ట దిగువన వరదనీరు పోయేందుకు సమాంతరంగా కాల్వలాంటి నిర్మాణం చేపట్టినా అది కట్టలోపలి ప్రాంతం కంటే ఎత్తులో ఉండటంతో వరదనీరు ఆ కాల్వలోకి వెళ్లకుండా లోతట్టులో ఉండే గ్రామంలోకి వెళ్లడంతో చివరన ఉన్న ఎస్సీ కాలనీలో పలు ఇళ్ల చుట్టూ నీరుచేరింది. అంతే కాకుండా గ్రామం మొత్తం కూడా భూమి జాలుపడుతుందని, దీంతో క్రమంగా పునాదులు కుంగడం, పాతగోడలైతే కూలిపోవడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. నిత్యం చల్లటి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు బయటకువచ్చి తిరుగు తుంటాయని వాపోతున్నారు. పునరావాస గ్రామం త్వరగా ఏర్పాటు చేయకపోతే ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్‌ తలచుకుంటే భయమేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


కొలిక్కిరాని ప్యాకేజీ

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చకచకా సాగిస్తోన్న నీటిపారుదలశాఖ అధికారులు, అందుకు అడుగడుగునా సహకరిస్తోన్న రెవెన్యూ యంత్రాంగం నిర్వాసితుల సమస్యలపై మాత్రం అంతులేని జాప్యం ప్రదర్శిస్తోంది. ఈ రిజర్వాయర్‌ కింద ఉదండాపూర్‌, వల్లూరు గ్రామాలతో పాటు చామగడ్డతండా, వంటిగుడిసె తండా,  తుమ్మలకుంట తండా, చిన్నగుట్టతండా, రాగడిపట్టి తండా ముంపునకు లోనవుతాయి. మొత్తం ఏడు ఆవాసాలకు గాను 2573 కుటుం బాలు నిర్వాసితులవుతారని తొలుత సర్వేలో నమోదు చేయగా, ఆ సర్వేలో అనర్హులను చేర్చారని ఆందోళన చేయడంతో తిరిగి రీసర్వే జరుపుతున్నారు. ఇప్పటికే దాదాపు 420 మంది పైచిలుకు అనర్హులను గుర్తించి ఏరివేయగా, మరో వారంలో ఈ ప్రక్రియ పూర్తిచేసే యోచనలో రెవెన్యూ అధికారులున్నారు. ఈప్రాంతం ఇప్పటికే ఒకవైపు పోలేపల్లి సెజ్‌, మరోవైపు జడ్చర్ల పట్టణం, సమీపంలో జాతీయ రహదారి, ఇతర పరిశ్రమలకు కేంద్రంగా ఉండటంతో ఇక్కడ భూములు, ఇళ్ల విలువ భారీగా పెరిగింది. ఇక్కడ ఎకరం భూమి రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఉండటంతో పాటు, ఇళ్ల స్థలాలు కూడా చదరపు గజానికి కనీసం రూ.6 వేల పైచిలుకు ధర పలుకుతుండటంతో అదే స్థాయిలో కాకపోయినా, కనీసం గౌరవప్రదంగా ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతోన్న ప్యాకేజీ ఇందులో నామమాత్రంగానే ఉండటంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ ముంపు గ్రామాల ప్రజలకు మధ్య తరచూ చర్చలు జరిగినా ప్యాకేజీ అంశం కొలిక్కిరాలేదు. తాజాగా నిర్వాసితులయ్యే ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ. 7.61 లక్షల ప్యాకేజీతో పాటు పునరావాస కేంద్రంలో ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే, ఇళ్ల స్థలంతో పాటు రూ. 12 లక్షల ప్యాకేజీని నిర్వాసితులు అడుగుతున్నారు. పునరావాస గ్రామం కోసం జడ్చర్ల, పోలేపల్లి శివార్లలోని 316 ఎకరాల భూమిని ఎంపిక చేసిన అధికారులు, అక్కడ ఇంకా పూర్తిస్థాయిలో ప్లాట్ల విభజన చేయకపోవడం, పునరావాస ప్యాకేజీపై ఇటు నిర్వాసితులకు అంగీకారం రాకపోవడంతో ఈప్రక్రియ ముందుకు సాగడం లేదు. పునరావాస ప్యాకేజీ విషయంలో రెండువైపులా అంగీకారం కుదిరి, ఆ తర్వాత ప్యాకేజీ మొత్తం తక్షణం అందజేస్తేనే నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయడం సాధ్యమవుతుందని, అప్పటివరకు ప్రధాన కట్ట పనులు కొనసాగిస్తే వరదలొచ్చిన ప్రతీసారి తీవ్రత పెరుగుతుందని, చివరకు ఇళ్లన్నీ మునిగిపోయే ప్రమాదమూ ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంలో తమను గుర్తించాలని, తక్షణం పునరావాస ప్యాకేజీ అందించడంతో పాటు, ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశంపై ఇటు సాగునీటి శాఖ అధికారులు గానీ, అటు రెవెన్యూ ఉన్నతాధికారులుగానీ పనులు ప్రొగ్రెస్‌లో ఉన్నాయనే పొడిపొడి సమాధానాలు తప్ప సరైన వివరణ ఇవ్వని పరిస్థితి స్థానికంగా నెలకొన్నది. 


ఇంటి చుట్టూ నీరు 

మా ఇంటి చుట్టూ వరదనీరు చేరింది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం. డ్యామ్‌లో నీళ్లు నిలవడంతోనే ఈసమస్య వచ్చింది. మాకు పునరావాసం కల్పించాలని కోరుతున్నాం. ఇస్తాం, ఇస్తాం అంటున్నారే గానీ, ఎటూ తేలడం లేదు. మాకు వేరేచోట ఇళ్లు కట్టించాకే ఇక్కడ ఖాళీ చేయించాలి. లేకపోతే అన్యాయమై పోతాం.

- తాటిపర్తి మాసయ్య, వల్లూరు 


వేగంగా పునరావాసం కల్పించాలి 

వానకు వచ్చే వరద చెరువులోకి పోకుండా డ్యాం కట్ట అడ్డుగా ఉన్నది. అందువల్ల మా ఇళ్ల వద్దకు నీరువచ్చిచేరింది. మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నా ఇక్కడ కట్టపనులు కొనసాగించడంతో ఈ పరిస్థితి దాపురించింది. మేం ఖాళీ చేయకుండా, మాకు పరిహారం, పునరావాసం ఇవ్వకుండా కట్ట నిర్మించడంతో వానొచ్చినప్పుడు నీళ్లు మా ఇళ్ల వద్దకు వ స్తున్నాయి. ప్రభుత్వం వేగంగా స్పందించి మాకు పునరావాసం కల్పించాలి. 

- ఎం. కుమార్‌, వల్లూరు 

Read more