లక్ష్యం కోసం అడ్డదారి

ABN , First Publish Date - 2022-06-08T04:49:27+05:30 IST

గద్వాల జిల్లాలో అధికారుల అనాలోచిత నిర్ణయం ప్రమాదాలకు కారణం కానుందా? రోడ్డు పక్కన మొక్కలు నాటడంలో నిబంధనలకు నీళ్లొదిలారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

లక్ష్యం కోసం అడ్డదారి
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు రెండు ఫీట్ల దూరంలో మొక్కలు నాటేందుకు ఎక్స్‌కవేటర్‌తో తీసిన కాల్వ

హరితహారంలో నిబంధనలకు నీళ్లు

ఆరు ఫీట్లకు బదులు రెండు ఫీట్ల దూరంలోనే నాటుతున్న మొక్కలు

మొక్కలు పెరిగాక రోడ్డు ప్రమాదాలు జరిగే దుస్థితి

ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డు చెబుతున్నా పట్టించుకోని వైనం


 గద్వాల జిల్లాలో అధికారుల అనాలోచిత నిర్ణయం ప్రమాదాలకు కారణం కానుందా? రోడ్డు పక్కన మొక్కలు నాటడంలో నిబంధనలకు నీళ్లొదిలారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. హరితహారం పథకంలో భాగంగా గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారి పక్కన మొక్కలు నాటుతున్నారు. అయితే ఇప్పటికే ఆ రోడ్డు పక్కన మొక్కలు నాటగా, మరోసారి రోడ్డుకు రెండు ఫీట్ల దూరంలో నాటడంపై విమర్శలు వస్తున్నాయి.

- గద్వాల


హరితహారం పథకంలో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల-ఎర్రవెల్లి రోడ్డు వెంట మొక్కలు నాటడంలో అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ విషయమై వాహనదారులతో పాటు ఆర్‌అండ్‌బీ అధికారులు అభ్యంతరం చెబుతున్నా, పనులు కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో హరితహారంలో భాగంగా దాదాపు 18 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్‌ విధించారు. ఉపాధి హామీ, జిల్లా పంచాయతీ, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో రూ.10 లక్షల మేర మొక్కలు నాటాల్సి ఉంది. అయితే మొక్కలు నాటేందుకు స్థలాలు కరువవడంతో అధికారులు అవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి పెట్టారు. ప్రధాన బీటీ రోడ్లతో పాటు పంచాయతీ రోడ్ల వెంట మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు 16 కిలో మీటర్ల మేర ఉన్న ప్రధాన అంతరాష్ట్ర బీటీ రోడ్డు పక్కన మొక్కలు నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు. టార్గెట్‌ పూర్తి చేసేందుకు అధికారులు రోడ్డు పక్కన ఏకంగా ఎక్స్‌కవేటర్‌తో కాలువ తవ్వి, అందులో మొక్కలు నాటడానికి ప్రణాళిక వేశారు.


గద్వాల-ఎర్రవల్లి బీటీ రోడ్డు పక్కనే...

ఎర్రవల్లి-గద్వాల అంతర్రాష్ట్ర రహదారి వెంట నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతాయి. జిల్లా కేంద్రం నుంచి పుటాన్‌పల్లి వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉండగా, అక్కడి నుంచి రెండు లేన్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డు వెంట హరితహారంలో భాగంగా ఇప్పటికే రెండు వరుసల్లో మొక్కలు నాటారు. ఇప్పుడు మూడో వరుస మొక్కలు నాటడానికి అధికారులు ప్రణాళిక వేశారు. అయితే బీటీ రోడ్డుకు రెండు ఫీట్ల దూరంలోనే నాటుతుండటం అభ్యంతరాలకు కారణమైంది. మొక్కలు పెద్దవి అయితే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు వరుసలలో నాటిన మొక్కలు పెద్దవి అయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. నెలలో రెండు మూడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకోకుండా అధికారులు రోడ్డుకు దగ్గరగా మొక్కలు నాటడంపై వాహనదాలతో పాటు ఆర్‌ అండ్‌ బీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. 


ఆర్‌ అండ్‌ బీ నిబంధనలు ఇవీ.. 

ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట మొక్కలు పెంచాలంటే నాలుగు లేన్ల రహదారికి నాలుగు ఫీట్ల దూరంలో, రెండు లేన్ల రహదారికి ఆరు ఫీట్ల దూరంలో మొక్కలు నాటాలి. దాంతో అవి పెద్దవి అయినా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ప్రధాన రహదారి వెంట రెండు ఫీట్ల దూరంలో మాత్రమే మొక్కలు నాటుతుంటం విమర్శలకు దారి తీస్తోంది. గద్వాల నుంచి పుటాన్‌పల్లి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. దానిని ఎర్రవల్లి వరకు విస్తరించే క్రమంలో ప్రభుత్వం మారడం, నిధుల లేమితో పనులు ఆగిపోయాయి. అయితే భవిష్యత్‌లో రోడ్డు విస్తరణ జరిగితే నాటిన మొక్కలు పెద్దవి అయినా తొలగించాల్సి వస్తుంది.


మొక్కలు నాటడం నిలిపేయాలని చెప్పాం

ప్రధాన రహదారి పక్కనే మొక్కలు నాటుతున్నట్లు సమాచారం ఉండటంతో మా ఏఈని పంపించాము. ఆమె ప్రాథమిక సమాచారం ఇచ్చారు. రోడ్డుకు రెండు మూడు ఫీట్ల దూరంలోనే మొక్కలు నాటేందుకు గుంతలు తీశారని చెప్పారు. వెంటనే డీఎల్‌పీవోకు ఫోన్‌ చేసి చెప్పాను. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయి, మొక్కలు నాటడాన్ని నిలిపేయిస్తామని చెప్పారు. నిబంధనల ప్రకారం అయి తే కనీసం ఆరు ఫీట్ల దూ రంలో మొక్క లు నాటాలి.

- కిరణ్‌, డీఈ ఆర్‌అండ్‌బీ, గద్వాలRead more