గద్వాలలో పత్తి రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-01-04T04:39:10+05:30 IST

ఓ ప్రైవేటు కంపెనీ పత్తి విత్తనాలు వేసి పూర్తిగా నష్టపోయామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ ముందు కలెక్టర్‌ కారును అడ్డుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు.

గద్వాలలో పత్తి రైతుల ధర్నా
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న రైతులు

కలెక్టర్‌ కారును అడ్డుకొని నిరసన

ప్రైవేటు కాంపెనీ విత్తనాలతో నష్టపోయామని ఆవేదన

మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని వెల్లడి


గద్వాల క్రైం, జనవరి 3 : ఓ ప్రైవేటు కంపెనీ పత్తి విత్తనాలు వేసి పూర్తిగా నష్టపోయామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ ముందు కలెక్టర్‌ కారును అడ్డుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి కారు దిగి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  రైతు గోవిందరెడ్డి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అమరవాయి. బోరవెల్లి, గోకులపాడు గ్రామాల రైతులం ఓ ప్రైవేటు కంపెనీ నుంచి పత్తివిత్తనాలను కొనుగోలు చేశామని, విత్తిన తర్వాత పూత, పిందెలు ఎండిపోయి దిగుబడి గణనీయంగా తగ్గి నష్టపోయిందన్నారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు రెండుసార్లు వచ్చి వాతావరణం బాగోలేదని, రైతులు పంటను ఆలస్యంగా సాగు చేశారని సాకులు చెబుతూ నివేదికను ఇచ్చారని ఆరోపించారు. అదే కంపెనీ విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు విత్తి నష్టపోవడంతో ఎకరాలకు రూ. 23,307 నష్ట పరిహారం నిర్ణయించి మొత్తం రూ. 16.91 కోట్లు చెల్లించారని వివరించారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ  మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి ఇంటికి మూడు సార్లు వెళ్లి పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం దృష్టికి కూడా తెచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో దిక్కుతోచక కలెక్టరేట్‌ ముందు ధర్నా చేసేందుకు వచ్చామని చెప్పారు. ఈ ధర్నాలో మానవపాడు మండలంతో పాటు అమరవాయి, బోరవెల్లి, జల్లాపురం రైతులు పెద్దయ్య, రామకృష్ణ, మన్నెపురెడ్డి, గురుస్వామి, శాంతన్న, మోహన్‌, వెంకటరాములు, లక్ష్మినాయుడుతో పాటు దాదాపు 100 మంది పాల్గొన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌ వల్లూరు క్రాంతి స్పందిస్తూ 10 రోజుల్లో సమస్య ను పరిష్కరించేలా కృషి చేస్తానని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.

Updated Date - 2022-01-04T04:39:10+05:30 IST