మూలన పడ్డ కంప్యూటర్లు

ABN , First Publish Date - 2022-12-30T23:39:37+05:30 IST

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైంది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు వృథాగా మారాయి.

మూలన పడ్డ కంప్యూటర్లు
అయిజ బాలుర ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు మూలన పడ్డ కంప్యూటర్లు

- సాంకేతిక విద్యకు దూరమైన విద్యార్థులు

అయిజ, డిసెంబరు 30 : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య దూరమైంది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు వృథాగా మారాయి. వాటి మరమ్మతులకు నిధులు లేక పోవటంతో నిరుపయోగంగా పడేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2005, 2006 సంవత్సరాల్లో కంప్యూటర్‌ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంతో పాటు, కంప్యూటర్‌ విద్య ప్రారంభానికి చర్యలు తీసుకుంది. అందులో భాగంగా అధికారులు జిల్లాలోని 124 ఉన్నత పాఠశాల ల్లో 48 బడులను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.

ప్రైవేట్‌ ఏజెన్సీలతో ఒప్పందం

కంప్యూటర్‌ విద్యాబోధనకు ప్రైవేట్‌ ఏజెన్సీలతో ప్రభుత్వం రెండు విడతలుగా ఒప్పందం కుదుర్చుకున్నది. ఏజన్సీ నిర్వాహకులు పాఠశాలలకు కంప్యూటర్లు అందించడంతో పాటు, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు కూడా ఏర్పాటు చేసి, నెట్‌ కనెక్షన్‌ కల్పించారు. కంప్యూటర్‌ విద్యను బోధించేందుకు శిక్షకుల ను నియమించారు. వారికి ప్రతీ నెల మూడు వేల రూపాయలు గౌరవ వేతనం అందించారు. టాల్‌ సంస్థ ఆధ్వర్యంలో 23, ఐసీసీ ద్వారా 32 పాఠశాలల్లో కొన్నేళ్ల పాటు విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను బోధించారు. మొత్తం 18,087 మంది కంప్యూటర్‌ విద్యను నేర్చుకున్నారు. 2013 - 2014 విద్యా సంవత్సరంతో ఒప్పందం ముగియడంతో శిక్షకులు వెళ్ళిపోయారు.

మరమ్మతులకు నిధుల కొరత

చాలాకాలంగా వినియోగించకపోవడంతో కంప్యూటర్లు చెడిపోయాయి. వాటిని మరమ్మతు చేయించాలని ఉన్నతాధికారులు గతంలోనే ప్రధానో పాధ్యాయులను ఆదేశించారు. కానీ అందుకు నిధు లు కేటాయించక పోవడంతో వారు వెనుకడుగు వేశారు. పైగా అప్పటికే కంప్యూటర్లు పూర్తిగా చెడిపోయాయి. వాటి మరమ్మతుకు అధిక మొత్తం లో డబ్బు ఖర్చు అవుతుందని, అయినా పెద్దగా ఫలితం ఉండదని భావించి వదిలేశారు. దీంతో విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యారు. కంప్యూటర్లు కూడా పనికి రాకుండా పోయాయి. కొన్ని చోట్ల అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

కంప్యూటర్లకు మరమ్మతు చేయించాలని పిబ్రవరి నెలలోనే ప్రధానోపాధ్యాయులకు సూచించాను. నిధులు కేటాయించకపోవడంతో వారు వెనకంజ వేశారు. సంవత్సరాలుగా మూలనపడ్డ కంప్యూటర్లను మరమ్మతు చేయించినా ఫలితం ఉండదని భావించి వదిలేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

- సిరాజుద్దీన్‌, జిల్లా విద్యాధికారి

Updated Date - 2022-12-30T23:39:37+05:30 IST

Read more